ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక, ఓ మూడేళ్లు గడిచాక… ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందేమో అనే అనుమానం అధికారంలో ఉన్నవారికి రావడం సహజం. అయితే, ఆ విషయాన్ని నిర్ధరణ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి..? అధికార పార్టీ పట్ల ప్రజానాడి ఎలా ఉందో తెలియాలంటే ఎలా..? మహా అయితే కొన్ని సర్వేలు చేయిస్తారు. ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారనేదే ఆ సర్వేల్లో వ్యక్తమౌతుంది. ఎందుకంటే, అవి వారే సొంతంగా చేయించుకునే సర్వేలు కాబట్టి. కానీ, కొన్ని సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక వచ్చినట్టుగా! నంద్యాల గెలుపుతో ప్రజల్లో వ్యతిరేకత అనేది ప్రతిపక్షం విమర్శిస్తున్నంత స్థాయిలో అస్సలు లేదని తేలింది. దీంతో టీడీపీ కేడర్ కు ఎక్కడలేని జోష్ వచ్చింది. అన్ని నియోజక వర్గాల్లోనూ నంద్యాల మోడల్ ను తీసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికొస్తే… ప్రస్తుతం ఏపీ టీడీపీలో నిండిన కొత్త ఉత్సాహాన్నే తెరాస శ్రేణుల్లో నింపాలని అనుకుంటున్నారట! అదెలా అంటే… సరదాగా ఒకటో రెండో స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిద్దామని అనుకుంటున్నారని ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. నిజానికి, తెరాస అధికారంలోకి వచ్చిన మొదట్లో కొన్ని ఉప ఎన్నికలు రావడం, వాటిలో తెరాస ఘన విజయం సాధించడం జరిగాయి. ఇప్పుడు మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి అంటున్నారు కదా. ఈ తరుణంలో తెరాస గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఒక ఎంపీ స్థానానికీ, వీలైతే ఓ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనీ, ఆ విజయంతో తెరాస శ్రేణులన్నీ వచ్చే ఎన్నికలకు సిద్ధమైపోతాయనీ, ఉప ఎన్నికల ఓటమితో ప్రతిపక్షాలను నైతికంగా ఇప్పట్నుంచే దెబ్బతీసినట్టుగా ఉంటుందనీ కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో ఎప్పుడో చేరారు. ఆయనతో రాజీనామా చేయించాలని సీఎం అనుకుంటున్నారట. దీంతోపాటు రాష్ట్రంలో వీలైతే ఇంకెక్కడైనా తెరాస బాగా బలంగా ఉన్న ప్రాంతంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందనీ భావిస్తున్నారట. మొత్తంగా ఈ వ్యవహారం ఎలా ఉందంటే… ఎన్నికల ప్రక్రియ అంటే అధికార పార్టీ సొంత బలం తెలుసుకోవడానికి వాడుకునే మాధ్యమంగా చూస్తున్నట్టున్నారు. తెరాస బలమెంతో తెలియాలంటే ఉప ఎన్నికలు ఒక్కటే మార్గమా..? అనివార్యమైతే తప్ప ఎన్నికలు నిర్వహించని పరిస్థితి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు ఎంతో ఖర్చు, కోడ్ అమల్లో ఉన్నంత కాలం ప్రభుత్వ కార్యకలాపాలేవీ సరిగా సాగవు. ఆయా నియోజక వర్గాల్లో ఏ పనులూ ఉండవు. అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆయా నియోజక వర్గాలపై మళ్లించాలి. ఇదంతా పెద్ద వ్యవహారం. ఇవన్నీ కేసీఆర్ కు తెలియనివి కావు. అయినాసరే, ఉన్నవారితో రాజీనామా చేయించి మరీ సొంత బలమేంటో తెలుసుకోవడానికే ఉప ఎన్నికకు వెళ్లడం కచ్చితంగా అధికార దుర్వినియోగం అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఇదో దుస్సంప్రదాయమై కూర్చుంటుంది!