ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన మనసులో మాట చెప్పారు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను. అవకాశం వస్తే ఎవరైనా ఉండరా..? నేను అంత అమాయకుడినా..? అవకాశం రావాల్నే కానీ.. తప్పకుండా రేసులో ఉంటానని చెప్పుకొచ్చారు.
అయితే కేసీఆర్ ఎంపీగా పోటీ చేయలేదు. మరి ఎలా ప్రధాని అవుతారంటే.. ముందు ప్రధాని అయిన తర్వాత ఎన్నికయ్యేలా చూసుకుంటారు కావొచ్చని అనుకోవచ్చు. పన్నెండు సీట్లు ఇవ్వాలని తెలంగాణలో చక్రం తిప్పుతానని కేసీఆర్, కేటీఆర్ అడుగుతూ వస్తున్నారు. వారి మొరను ప్రజలు ఎంత వరకూ ఆలకిస్తారో తెలియదు కానీ ఆయన ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ కు ప్రధాని పదవిపై ఎప్పటి నుండో ఆశలు ఉన్నాయి. అందుకే జాతీయ పార్టీని పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇచ్చారు. కానీై తెలంగాణలో ఓడిపోవడంతో ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకమయింది.
కేసీఆర్ ఇంకా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ తో తమను గెలిపిస్తారన్న ఊహాల్లోనే ఉన్నారు. తాము ఉన్నప్పుడు ప్రజల్లో స్వర్గంలో ఉన్నారని.. ఇప్పుడు నరకానికి వెళ్లిపోయారని.. మళ్లీ బీఆర్ఎస్ కు ఓటు వేసి స్వర్గానికి వస్తారని గట్టిగా నమ్ముతున్నారు. వీరి వమ్మకం ఎంత వరకు నిజమో జూన్ నాలుగో తేదీన తేలిపోయే అవకాశం ఉంది.