తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భారతీయ జనతా పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఆదివారం పూట ప్రెస్‌మీట్ పెట్టి గంటకుపైగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు దగ్గరనుంచి విభజన హామీల వరకూ ప్రతి అంశాన్ని గుర్తు చేసి..బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకూ చాలా ఎక్కువ మాట్లాడారని ఇక నుంచి క్షమించే ప్రశ్నే లేదని కేసీఆర్ తేల్చేశారు. రేపట్నుంచే దేశంలో అగ్గి పెడతాం కాచుకోవాలని సవాల్ చేశారు .
బండి సంజయ్ మెడలు విరిచేస్తామన్న కేసీఆర్ !
తనను జైలుకు పంపుతానని పదే పదే ప్రకటిస్తున్న బండి సంజయ్‌పై కేసీఆర్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. బండి సంజయ్ ఇప్పటి వరకూ చాలా ఎక్కువ మాట్లాడారని.. ఆయనది తన స్థాయి కాదని ఊరుకున్నానని కానీ ఇప్పుడు ఆయన మరీ ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామని అంటున్నారని.. దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడాలని సవాల్ చేశారు. కేసీఆర్‌ను జైలుకు పంపి బతికి బట్టకట్టగలవా అని హెచ్చరిక జారీ చేశారు. తాము బీజేపీ మెడలు వంచడం కాదని.. మెడలు విరిచేస్తామని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కేసులు పెడతామన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా !
ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ ఆందోళనలు చేస్తోంది. అయితే దాన్యం కొనుగోలు చేసేది కేంద్రమే కానీ రాష్ట్రం కాదని.. కేంద్రమే తాము కొనుగోలు చేయమని అంటోంది కాబట్టి.. యాసంగిలో తాము వరి వేయవద్దని చెబుతున్నామని కేసీఆర్ తెలిపారు. అయితే బీజేపీ అబద్దాలు చెబుతూ… రాష్ట్రమే కొనుగోలు చేయడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని.. విమర్శించారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసే వరకూ బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ప్రకటించారు. ఢిల్లీ బీజేపీ వరి వద్దని చెబుతూంటే సిల్లీ బీజేపీ కావాలని అంటోందని సీరియస్‌గా సెటైర్ వేశారు. పంజాబ్‌లో వంద శాతం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని.. తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. రైతులను మోసం చేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తామని హెచ్చరించారు. అందరితో కలిసి కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రేపటి నుంచి దేశంలో అగ్గి పెడతాం !
రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్ మరోసారి గళమెత్తారు. వారికి మద్దతు ప్రకటించారు. రైతు చట్టాలు మోసమని.. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని కేసీఆర్ లెక్కలు చెప్పారు. జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదున్నారు. 150కిపైగా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. అలాగే విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలను ఇంకా నెరవేర్చలేదని బండి సంజయ్ వాటిని తీసుకు రావాలని సవాల్ చేశారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇలాంటి మాటలే మాట్లాడారు. తర్వాత చట్టాలను సమర్థించినట్లుగా మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు మరోసారి రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పెట్రో పన్నులు మేం పైసా పన్ను పెంచలేదు.. తగ్గించం !
పెట్రో పన్నులు తగ్గించాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనలపైనా కేసీఆర్ మండిపడ్డారు. పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తూ కేంద్రం రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలు ఇవ్వకపోగా.. సెస్‌ల రూపంలో తానే ఉంచుకుంటోందని మండిపడ్డారు. చాలా ఎక్కువగా రేట్లు పెంచి చాలా తక్కువ తగ్గించి ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు పెడుతోందన్నారు. తాము వ్యాట్ పెంచలేదని.. తగ్గించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం పెట్రోల్, డిజిల్‌పై వసూలు చేస్తున్న సెస్‌ను తొలగించేలా ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.
ఒక్క ఉపఎన్నికలో గెలిస్తే భూమి బద్దలవుతుందా ?
హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమిని కేసీఆర్ తేలిగ్గా తీసుకున్నారు. తాము ఎన్నో ఉపఎన్నికల్లో గెలిచామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. తాము హుజూర్‌నగర్‌లో గెలవలేదా అని ప్రశ్నించారు.