కొత్తగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్లు, మేయర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సోయి తప్పి ఎవ్వరూ పనిచేయకూడదు అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు! పదవి అంటే కత్తి మీద సాములాంటిందనీ, కోట్లమందిలో మీకు వచ్చిన అవకాశం వచ్చిందనీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం పని చెయ్యాలన్నారు. మున్సిపాలిటీలంటే అవినీతి, మురికికి మారుపేరుగా మారిపోయాయనీ, ఆ పరిస్థితిని మార్చుకుందామన్నారు. ప్రజా ప్రతినిధులు ఫొటోలకు ఫోజులకు ఇవ్వవడం తగ్గించుకోవాలనీ, డంబాచారాలు పలకొద్దన్నారు. కేవలం పనులపై మాత్రమే దృష్టి పెట్టాలనీ, ఈనెల 24 నుంచి పదిరోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
మూడు నెలల్లో అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సిందేననీ, 8 నెలల్లో విద్యుత్ సమస్యల్ని కూడా చక్కదిద్దాలనీ, ఈ లక్ష్యాలను చేరకుంటే సంబంధింత ప్రాంత ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్ పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి తప్పుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు. అందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. మండల, పంచాయతీ స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించేందుకు కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, ఎమ్మెల్యేలూ కలెక్టర్లు గ్రామాల్లో బస చేసి, పాదయాత్రలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
మరుగుదొడ్ల నిర్మాణంగానీ, విద్యుత్ సమస్యలుగానీ, మురికి కాల్వలను శుభ్రపరచడంగానీ ఇలాంటివన్నీ నగరపాలక సంస్థల రొటీన్ బాధ్యతలు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చూడాల్సినవి ఇవే కదా! కానీ, ఏంటో.. వీటికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టి, చెయ్యపోతే పదవి ఊడగొడతా అంటూ హెచ్చరించి మరీ చేయించుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు! నాయకుల్నీ, అధికారుల్నీ ఇలా హెచ్చరించడం ఇదేం కొత్త కాదు! పల్లె ప్రగతి కార్యక్రమం అమలు సమయంలోనూ ఇలానే… నిర్దేశిత లక్ష్యాలు సాధించకపోతే సర్పంచ్ పదవుల్ని ఊడగొడతా అన్నారు కేసీఆర్. ఒకటైతే వాస్తవం, కిందిస్థాయి నాయకులో కొంత నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. అయితే, ఇలా ప్రతీసారీ హెచ్చరించి పనులు చేయించుకోవచ్చు అనుకుంటే… అంతిమంగా అది నాయకత్వ వైఫల్యంగా కూడా కనిపిస్తుంది. కేసీఆర్ మామూలుగా చెబితే నాయకులు వినరా? పదవి ప్రాతిపదికనే నాయకులు పనిచేస్తారా? ముఖ్యమంత్రి హెచ్చరిస్తే తప్ప సాధారణ విధి నిర్వహణ కూడా వీళ్లు చెయ్యరా, వీళ్లతో నాయకత్వం చేయించుకోలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.