పట్టణ ప్రగతి కార్యక్రమం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు మంత్రి కేటీఆర్. ఇది పట్టణాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మాత్రమే ప్రారంభించిందన్నారు. ఇది ఎన్నికల సమయం కానే కాదు, అన్ని రకాల ఎన్నికలూ పూర్తయిపోయాయన్నారు. రాబోయే నాలుగేళ్లపాటు ప్రజలకు సేవ చేసుకుని, వారి మనసు దోచుకునే ఉద్దేశంతో చేస్తున్నామన్నారు. గతంలో మున్సిపాలిటీలంటే చెడ్డ పేరు ఉండేదనీ, అది పూర్తిగా పోవాలన్నారు. బల్దియా అంటే ఖాయా పీయా చల్దియా అనే అపవాదు ఉందనీ, దాన్ని పూర్తిగా మార్చాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు.
ఈ సందర్భంగా నాయకులకు మరో హెచ్చరిక కూడా చేశారు మంత్రి కేటీఆర్! పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల వార్డుల్లో మొక్కలను పెద్ద సంఖ్యలో నాయకులు నాటుతున్నారు. ఇది మంచి విషయమే. వీటిలో కనీసం 85 శాతం మొక్కలు బతికి తీరాలనీ, ఈరోజు ఆడంబరంగా పాతేసి, ఆ తరువాత వాటిని పట్టించుకోకుండా ఉంటే కుదరదన్నారు కేటీఆర్. ఇదీ ఓకే! అయితే, మొక్కల బాధ్యతలు కౌన్సిలర్లు తీసుకోవాలనీ, అవి బతక్కపోతే కౌన్సిలర్ల పదవులు ఊడగొట్టడం ఖాయమన్నారు కేటీఆర్. భవన నిర్మాణ అనుమతులు మరింత సులభతరం చేసేందుకు ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ విధానం అమల్లోకి తెస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.
పదవులు ఊడగొడతా అంటూ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం నుంచే నాయకులకు కేటీఆర్ వార్నింగులు ఇస్తూ వస్తున్నారు. పట్టణ ప్రగతి విజయవంతం చేయకపోతే పదవులు పీకేస్తామని గతవారంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు… మొక్కలు బతక్కపోతే పదవులు ఊడగొడతామంటున్నారు. కేటీఆర్ ఒక్కరే కాదు… మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కూడా పట్టణ ప్రగతి ప్రారంభానికి ముందు రోజు నాయకులతో మాట్లాడుతూ… సరిగా పనిచేయకపోతే పదవులు పోతాయి జాగ్రత్త అంటూ మాట్లాడారు! ఒకసారి చెప్తే చాలదా..? పదేపదే ప్రతీ అంశంలోనూ పదవులు పీకేస్తామని బెదిరించాలా..? మొక్కలు పెంచాల్సిన బాధ్యతను, అవసరాన్ని నాయకులకు తెలిసేలా చేయాలిగానీ… ప్రతీదానికీ పదవులు పీకేసుడేనా తారక మంత్రం?