కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు వందశాతం సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. సహకరించకపోయినా చర్యలు ఆగవని సున్నితంగా హెచ్చరించారు. ప్రజలు సహరించకపోతే 24 గంటలు కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందనీ, ఇంకా వినకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇయ్యాల్సి ఉంటుందనీ, అప్పటికీ అదుపులోకి రాకపోతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్ని ఉంటుందనీ… ఈ పరిస్థితి తెచ్చుకుందామా, ఇలాంటి దుస్థితి మనకు అవసరమా అనేది అందరూ ఆలోచించుకోవాలన్నారు. ఎక్కడివాళ్లు అక్కడుంటే అయిపోతుంది కదా! వినకపోతే ప్రభుత్వం ఆగదన్నారు.
జిల్లాలోగానీ, హైదరాబాద్లోగానీ ఈ నియంత్రణ విషయంలో పోలీసులు, కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారనీ, ప్రజా ప్రతినిధులు ఎక్కడికిపోయారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీలో 150 కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్నారు? ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, మున్సిపల్ లాంటివి మినహా… మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రాంతాలకి వెళ్లాలని కోరారు. అక్కడ ప్రజల కోసం పనిచెయ్యాలన్నారు. పోలీసులో కో ఆర్డినేట్ చేసుకుంటూ స్థానికంగా ఈ కరోనా నియంత్రణ కార్యక్రమంలో బాధ్యత తీసుకోవాలన్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో కచ్చితంగా మనం ప్రజల మధ్యనే ఉండాలన్నారు. గ్రామస్థాయిలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని స్థాయి నాయకులు రంగంలోకి దిగాలన్నారు.
హోం క్వారంటైన్లో ఉన్నవారిపై గట్టి నిఘా ఉందనీ, పాస్ పోర్టులు సీజ్ చేస్తామని చెప్పామన్నారు. నకరాలు చేస్తే పాస్ పోర్టులు సస్పెండ్ చేస్తామన్నారు. పౌర సమాజానికి సహకరించనివారు, పౌర సదుపాయాలు పొందేందుకు అర్హులుకారు అని స్పష్టం చేశారు. కూరగాయలు పెంచడం కొంత బాధాకరమైన విషయమన్నారు. ఎక్కువ ధరలు పెంచుతామని ఎవరన్నా అంటే నడవదనీ, ఎక్కువ ధరలకు అమ్మినవారిపై పీడీ యాక్టు పెట్టి నేరుగా జైలుకు పంపుతామన్నారు. నిత్యావసరాల ధరలు పెంచితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. దేవుని దయవల్ల ప్రస్తుతం పరిస్థితి ఈరోజుకి నియంత్రణలో ఉందనీ, అందుకే అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందన్నారు. మొత్తానికి, లాక్ డౌన్ రెండో రోజు కొంత నియంత్రణకు వచ్చిన పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది.