టీఆర్ఎస్లో చెలరేగుతున్న అసమ్మతిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. తిరుగుబాటు దారుల్ని ఏమాత్రం ఉపేక్షించేందుకు కేసీఆర్ సిద్దంగా లేరు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులపై రెబల్స్ భగ్గుమంటున్నారు. ప్రత్యేక సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నారు. ఆది నుంచి ఉన్న నేతలకు, మధ్యలో వచ్చిన నేతలకు, పార్టీ అధికారంలోకి వచ్చాక వచ్చి చేరిన నేతలకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీనికి తోడు కేసీఆర్ ఆకస్మాత్తుగా విడుదల చేసిన జంబో లిస్ట్‌తో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తులు భగ్గుమన్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ వాళ్లంతా నిరసన బాట పట్టారు. అభ్యర్థులను మార్చాల్సిందేనంటూ పట్టుబట్టారు.
నల్లగొండ జిల్లా మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వర్ రావు బహిరంగసభ ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో పార్టీ వెంకటేశ్వర్ రావు వ్యవహారంపై దృష్టి సారించిన హైకమాండ్ ఆయన్ను పిలిచి మందలించింది. అయినా వెంకటేశ్వర్ రావు వెనక్కి తగ్గకపోవడంతో… ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చర్య మిగతా రెబల్స్‌కు గుబులు పెట్టిస్తోంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే.. ఎవరికైనా.. ఇదే పరిస్థితి అనే సిగ్నల్స్ పంపారు సీఎం కేసీఆర్. అయితే నల్గొండలో అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నారు. వారికి వేనేపల్లిపై వేటు వార్నింగ్‌లా మారింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభ్యర్ది నోముల నర్సింహ్మయ్యకు వ్యతిరేకంగా ఎంసీ కోటిరెడ్డి అసమ్మతి సమావేశాలు నిర్వహించారు. స్థానికేతరుడు తమకు వద్దంటూ గళమెత్తారు.
నల్లగొండ నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మరో నేత దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్ కుమార్ లు పనిచేస్తున్నారు. తమకే టికెట్టు కేటాయించాలంటూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. వీరిద్దరినీ కూడా పిలిపించి కెటిఆర్ చర్చలు జరిపారు. అధినేత నిర్ణయం ప్రకారం… పనిచేయాలని లేదంటే మీ ఇష్టం అని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభ్యర్ధిని ఎంపిక చేయకున్నా… ఇంఛార్జ్ శంకరమ్మ టికెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు టికెట్టు ఇచ్చేందుకు పార్టీ సిద్దంగా లేదు. దీంతో ఆమెను పలుమార్లు కెటిఆర్ పిలిపించి మాట్లాడి సర్దిచెప్పినట్లు చెబుతున్నారు. ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మిర్యాలగూడలోనూ సిట్టింగ్ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావుకు వ్యతిరేకంగా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి పనిచేస్తున్నారు. భాస్కర్ రావును మార్చకపోతే… స్వతంత్ర అభ్యర్ధిగానైనా రంగంలోకి దిగుతానని ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అమరేందర్ రెడ్డితోనూ కెటిఆర్ చర్చలు జరిపారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా వేటు తప్పదన్న హెచ్చరికలతో అమరేందర్ రెడ్డి ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. తుంగతుర్తిలోనూ సిట్టింగ్ అభ్యర్ధి గాదరి కిషోర్ అభ్యర్ధిత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామ్యేల్ అసమ్మతి సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఆయనను కూడా బహిష్కరిస్తామని హెచ్చరికలు పంపారు.