రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా సంచలనం సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ … తనచాయిస్‌గా అన్నా హజారానే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ వారమే వెళదామనుకున్నారు కానీ ఆగిపోయారు. వచ్చే వారం వెళ్లే అవకాశం ఉంది.
అన్నాహజారే కాంగ్రెస్ హాయంలో అవినీతి వ్యతిరేక పోరాటం.. లోక్ పాల్ బిల్లు కోసం చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ పోరాటం నుంచే వచ్చారు. అన్నా హజారే నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఏ పార్టీకీ ఆయన మద్దతుగా ఉన్న సందర్భాలు లేవు. దీంతో అన్ని పార్టీలు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తాయని కేసీఆర్ నమ్ముతున్నారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్‌తోనూ ఈ అంశంపై కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దేవేగౌడ, కుమారస్వామితోనూ ఇదే టాపిక్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు . కేసీఆర్ సంచలనం సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆ సంచలనం ఎప్పుడు ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికలే కేసీఆర్ టార్గెట్ అని.. అందులోనే సంచలనానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అన్నా హజారేను తెరపైకి తెస్తున్నారని భావిస్తున్నారు.