తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాలు హెవీగా ఉంటాయి. ఎంత అంటే.. లబ్దిదారులకు.. వందల్లో..వేలల్లో కాదు ఏకంగా లక్షల్లోనే నగదు బదిలీ జరిగిపోతుంది. దళిత బంధు ద్వారా పది లక్షలు ఇస్తున్నారు. బీసీ పథకం ద్వారా రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఇళ్ల నిర్మాణం కోసం రూ. మూడు లక్షలు ఇవ్వాలని డిసైడయ్యారు. కొత్తగా ఇళ్ల పథకానికి ఈ ఏడాది రూ. 18వేల కోట్లను ఖర్చు చేస్తామని చెబుతోంది.
దళిత బంధు పథకానికి, బీసీ బంధు పథకానికి కూడా వేల కోట్లు కావాలి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణ పథకానికీ అంత కంటే ఎక్కువ ఖర్చు చేస్తామని చెబుతోంది. నిజంగా ఇస్తారా లేదా అన్న సంగతి తర్వాత. కానీ మంజూరు పత్రాలు మాత్రం విస్తృతంగా పంపిణీ చేయనున్నారు. గతంలో డబుల్ బెడ్ రూంఇళ్లను ప్రారంభించినప్పుడు ఇంటి స్థలం ఉండి.. ఇల్లు కట్టుకోలేని వారికి డబ్బులిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ పెట్టింది. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు.
ఎన్నికలు రాబోతున్న సమయంలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత త#హశీల్దార్లకు పంపించాలని, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తు తీసుకుంటారన్నమాట. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు వచ్చేస్తాయి. ఆ లోపు కొంత మందికి ఇచ్చినా మిగతా వారికి ఎన్నికల తర్వాత ఇస్తారన్న నమ్మకంతో ఓట్ల పంట పండుతుందని బీఆర్ఎస్ పెద్దలు ఆశిస్తున్నారు .
తెలంగాణ సర్కార్ ఆర్థిక సమస్యల్లో ఉంది. ఏపీలోలా తెలంగాణను తాకట్టు పెట్టే ప్రయత్నం చేయలేదు కానీ భారీ ఎత్తునరుణాలు తీసుకు వచ్చి.. ప్రాజెక్టులకు ఖర్చు చేయడంతో ఇబ్బంది పడుతోంది.అయితే ఎన్నికల ఏడాదిలో ఇలాంటివి అధిగమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.