హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఒక సంచలన వార్త వెలుగులోకొచ్చింది. 2006లో కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన ఒక కాంట్రాక్ట్‌లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ అధికారులు నిన్న కేసీఆర్‌ను ప్రశ్నించారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించే పనుల కాంట్రాక్ట్‌ను, సాధారణంగా ఆ పనులు చేసే కేంద్ర సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ)కి కాకుండా నాటి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ఇచ్చారు. ఆ సంస్థ నిర్మించిన భవనాలు నాసిరకంగా ఉండటంతో ఈఎస్ఐ సంస్థ 2007-08లో దర్యాప్తుకు ఆదేశించింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిర్మాణం వలన కనీసం రు.5 కోట్లు నష్టం వాటిల్లిందని ఐఐటీ నిపుణులు రూపొందించిన నివేదికలో తేలింది. వారి దర్యాప్తులో తేలిన ప్రాధమిక సమాచారం ఆధారంగా సీబీఐ వారి యాంటీ కరప్షన్ విభాగం 2011 సంవత్సరంలో కేసును నమోదు చేసి క్షుణ్ణమైన దర్యాప్తుకు దిగింది.
అసలే ప్రతిపక్షాలనుంచి ఎడాపెడా విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌కు ఇది చెడువార్తే. ప్రతిపక్ష నాయకులు మాత్రం పండగ చేసుకుంటారు. తమకు దొరికిన బలమైన ఈ ఆయుధంతో కేసీఆర్‌పై చెలరేగిపోనున్నారు.
ఈ సందర్భంగా మరో విషయాన్ని చెప్పుకోవాలి. కేసీఆర్ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్ట్ గత ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ ఎస్పీని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాలాజీ వదేరా అనే వ్యక్తి చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా కోర్ట్ కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు, విజయశాంతిలపైకూడా దర్యాప్తు జరపాలంటూ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే సాంకేతిక కారణాలరీత్యా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు.