సమస్యలన్నీ పరిష్కరించేసి గ్రేటర్ ఎన్నికలకు ముహుర్తాన్ని ఖరారు చేయాలనుకుంటున్న కేసీఆర్ మరో కీలక సమస్యపై దృష్టి సారించారు. అదే ఇళ్ల రిజిస్ట్రేషన్లు. రెండు నెలలుగా … తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ధరణి వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రారంభమయ్యాయి. కానీ ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత తమ స్థలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలో అన్న భయం వారిని వెంటాడుతోంది. గ్రేటర్ ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్లో ఉన్న ఈ ఆందోళనను దూరం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎప్పటి నుండి ప్రారంభించాలన్నదానిపై కేసీఆర్ నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. కానీ.. ఆస్తులన్నీ ఆన్ లైన్ కాలేదు. కరోనా కారణగా .. వరదల కారణంగా ధరణిలో ఆస్తులను ఆన్ లైన్ చేయడం ఆలస్యం అవుతోంది. మధ్యలో కొన్నాళ్లు ఆస్తుల నమోదును నిలిపివేశారు. కోర్టు కేసులు కూడా పడ్డాయి. ధరణిలో ఆస్తుల నమోదును రెండు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు కూడా ఆదేశించిది. ఈ క్రమంలో ఆస్తుల నమోదు.. పూర్తి కాలేదు.
ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. తప్పనిసరిగా ఆస్తులు ఆన్ లైన్ అయి ఉండాలి. అలా కాకపోతే.. రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. ప్రస్తుతం ఆస్తులన్నీ ఆన్ లైన్ కాలేదు. రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఇదేపెద్ద అడ్డంకి అవుతుంది. దీనికి అధికారులు పరిష్కార మార్గాన్ని చూపిస్తే.. వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించే అవకాశం ఉంది. అదే సమయంలో సమాచార భద్రత ఉంటుందని.. హైకోర్టుకు చెబితే… ఆస్తుల నమోదుపై విధించిన స్టేను కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పుడు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.