కేసీఆర్ ఎంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారో.. అంతే సడెన్గా హైదరాబాద్ తిరిగి వచ్చారు. వచ్చినవెంటనే… అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు, అధికారులతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలపై చర్చించారు. కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం పట్టంచుకోలేదు. బ్యాలెట్లో తొలి ఈవీఎంలోనే .. కారును పోలిన గుర్తు ఉండనుంది.
అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మంజూరు అయిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. వీటన్నింటిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈసీ తీరుపై న్యాయపోరాటం చేయాలా లేక ప్రజల్లోకి వెళ్లాలా అన్నదానిపై చర్చించారు.
మునుగోడులో కేసీఆర్ ప్రచారంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన ఒకటి, రెండు బహిరంగసభల్లో ప్రసంగిస్తారని గతంలో టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే ఎప్పుడు బహిరంగసభ పెట్టాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మునుగోడులో రాజకీయ పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దసరా రోజున బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకే మునుగోడు నోటిఫికేషన్ వచ్చింది. ఈ కారణంగా టీఆర్ఎస్ తరపునే మునుగోడులో పోటీ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల సన్నాహాల్లో ఉన్న కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి…బుధవారమే తిరిగి వచ్చారు. అందుకే మునుగోడుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. ఇప్పుడు స్వయంగా ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా తాను కూడా ఓ గ్రామానికి ఇంచార్జిగా ఉన్నారు.