ముందస్తు ఎన్నికలకు రాబోతాయనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నసందర్భమిది. అందుకే, ఎవరి ఏర్పాట్లలో వారు ఉంటున్నారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఏర్పాట్లు చాలావరకూ చేసుకుంటున్నారు! నియోజక వర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు, ఇంకోపక్క తక్షణ రాజకీయ ప్రయోజనాలను చేకూర్చే ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడుతున్నారు! అయితే, ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కూడా ముందస్తు ఇమేజ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టారనాలి! ఆయనే కాబోయే సీఎం అనే అభిప్రాయం తెరాస వర్గాల్లో బాగానే ఉంది. ఎందుకంటే, ఫెడరల్ ఫ్రెంట్ అంటూ కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు వెళ్తే, రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్ కి అప్పగిస్తారనే ప్రచారం ఈ మధ్య తీవ్రంగా జరిగింది. దాన్ని అప్పుడు కేటీఆర్ ఖండించనూ లేదు, స్పందించనూ లేదు.
అయితే, జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితులు చూసుకుంటే… కేసీఆర్ సూత్రంగా పెట్టుకున్న కాంగ్రెసేతర, భాజపాయేతర ఫ్రెంట్ సాధ్యమయ్యే సూచనలు లేవు. ఒక జాతీయ పార్టీని వ్యతిరేకించాలంటే, మరో జాతీయ పార్టీ అండ తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. భాజపా వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ కూడా ఉంది. ఈ మధ్య ప్రధాని మోడీతో వరుసగా కేసీఆర్, కేటీఆర్ లు భేటీలు అయిన తరువాత ఫెడరల్ ఫ్రెంట్ గురించి కేసీఆర్ కూడా పెద్దగా మాట్లాడటం లేదు! దీంతో పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే దాదాపు స్థిరపడ్డ ‘కాబోయే సీఎం కేటీఆర్’ అనే అభిప్రాయాన్ని మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి కేటీఆర్ ఇప్పుడు చేస్తున్న పని ఇదే. ట్విట్టర్ లో కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… కాబోయే సీఎం కేసీఆర్ పనిగట్టుకుని స్పష్టం చెప్తున్నారు. తెలివైనవారు ఎవరైనా ఆయనే సీఎం కావాలని ఓటేస్తారన్నారు. తాను సిరిసిల్ల నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాననీ చెప్పారు.
తాజా వ్యాఖ్యల ద్వారా రెండు అభిప్రాయాలపై కేటీఆర్ స్పష్టత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటిది, కేసీఆర్ నాయకత్వంలోనే మరోసారి తెరాస ఎన్నికలకు వెళ్తుందని చెప్పడం. రెండోది… తాను సిరిసిల్ల నుంచే పోటీచేస్తానని అనడం! నిజానికి, సిరిసిల్లలో ఈసారి కేటీఆర్ కి కాస్త ఇబ్బందే అని అభిప్రాయం ఆ మధ్య వ్యక్తమైంది. అంతేకాదు, ఈసారి ఆయన వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ తెరాస శ్రేణుల్లో సాగింది. ఈ అభిప్రాయానికీ చెక్ చెప్తున్నట్టు చూడొచ్చు. పని గట్టుకుని ఈ అంశాలపై మాట్లాడటం చూస్తుంటే… పార్టీ శ్రేణుల్లో స్థిరమైన కొత్త అభిప్రాయాలను ఏర్పరచే ప్రయత్నంగా కనిపిస్తోంది. దీంతోపాటు, ఫెడరల్ ఫ్రెంట్ ఆలోచనల్నుంచి కూడా శ్రేణులను డైవర్ట్ చేసే క్రమం కూడా ఈ ప్రయత్నంలో భాగంగా ఉందనే అభిప్రాయమూ కలుగుతోంది.
https://twitter.com/KTRTRS/status/1018398367213187077