గత వారం రోజులుగా తెలంగాణ శాసనసభ తీరుతెన్నులు గమనిస్తే కాస్త పదునుగా వ్యవహరించాలన్న కాంగ్రెస్ వ్యూహం అమలులోకి వచ్చినట్టే కనిపిస్తుంది. బయిట ఆ పార్టీ ఏం చేసినా సభలో మాత్రం ప్రతిపక్ష నేత జానారెడ్డి తమ పట్ల మెతగ్గా వుంటారనే భరోసా టిఆర్ఎస్కు వుండేది. అంతర్గత సమావేశాల్లో తీవ్రమైన ఒత్తిడి విమర్శలు వచ్చాక జానారెడ్డి ఆ విధానాన్ని మార్చుకోకతప్పలేదు. ప్రస్తుత సమావేశాల్లో ఒకటికి రెండు సార్లు వాయిదా తీర్మానాలు వాకౌట్లు వాదోపవాదాలు చూస్తే ప్రభుత్వం నల్లేరు మీద బండిలా నడిచిపోదని స్పష్టమై పోతున్నది. సభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు మాటకు మాటగా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నా చివరకు వచ్చే సరికి పాలక పక్షం కూడా ఒకడుగు వెనక్కు వేయక తప్పడం లేదు. దీనికి పరాకాష్ట హెచ్‌సియు, ఓయు ఉదంతాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన నష్టనివారణ చర్యలు.దీనిపై చర్చకు మొదట చాలా వాదన జరిగింది. మొదలైన తర్వాత కూడా హౌం మంత్రి నాయని నరసింహారెడ్డి రోహిత్ వేముల వడ్డెర గనక ఇది దళిత సమస్యే కాదంటూ పాత పాట పాడారు. కాని అతను దళితుడా కాదా అనే చర్చ అప్రస్తుతమని కెసిఆర్ తర్వాత చెప్పాల్సివచ్చింది. ఇంత జరిగినా తను హెచ్‌సియును సందర్శించలేదని అంగీకరిస్తూ అందుకు సాంకేతిక సమర్థనలే చేసుకున్నారు. వివక్షను గట్టిగానే ఖండిస్తూ మాట్లాడ్డమే గాక కన్నయ్య కుమార్‌ను అరెస్టు చేయొద్దని తాను ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చినట్టుచెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో దీనిపై వివరంగా మాట్లాడని కెసిఆర్ ఇప్పుడు ఇలా స్పష్టంగా చెప్పడం మంచి విషయమే. విసి అప్పారావును వెనక్కుపంపించవలసిందిగా సభ అభిప్రాయంగా తాను ప్రధానితో మాట్లాడతానని చెప్పడం కూడా విద్యార్థు కోర్కెకు విజయమే. ఇవన్నీ నిజంగా జరుగుతాయా అనేదిఒకటైతే ఆలస్యంగానైనా కెసిఆర్ లోపాలను ఒప్పుకోవడం మంచి విషయం. అయితే అదే సమయంలో ఉద్యమం దీనివల్ల ఆగేదీ వుండదు.