ముఖ్యమంత్రి విచక్షణా నిధి కింద ప్రత్యేకావసరాల కోసం రు.5000 కోట్లు అట్టిపెట్టాలని తెలంగాణ క్యాబినెట్ తీసుకున్నట్లు చెబుతున్న నిర్ణయంపై విమర్శలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వమంటే ముఖ్యమంత్రే గనక ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, కేటాయింపులు చేయొచ్చు. తప్పులు జరిగితే తర్వాత జవాబు చెప్పుకోవలసి వుంటుంది. అయినా సరే విభాగాల వారీగా కేటాయింపులు బడ్జెట్లో చేయడం తప్ప మంత్రులకు ముఖ్యమంత్రులకు చేతికింద నిధులు వుంచే పద్ధతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వుండదు. అందులోనూ అయిదువేల కోట్లు చాలా పెద్ద మొత్తం. ఇది గాక మంత్రులకు ఒక్కొక్కరికి 25 కోట్ల మొత్తం ప్రత్యేకావసరాల నిమిత్తం కేటాయిస్తారు. ప్రజా ప్రతినిధులకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల వంటి ఏర్పాటు ఇది వరకే వుంది. అయినా అధికాక పక్షంలో చేరితేనే అభివృద్ధి అన్న మాట మార్మోగుతున్నది. ఇలాటి సమయంలో అనామతు కింద ఇంత భారీ మొత్తాలు వుండేట్టయితే అస్పష్టత పెరగడమే గాక అవకతవకలకూ అవకాశం పుష్కలం. రాజకీయ ఫిరాయింపులు బేరసారాలు అవినీతి వ్యవహారాలు జోరుగా సాగే కాలం ఇది. కెసిఆర్ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు ప్రత్యక్షంగా రానప్పటికీ ఆరోపణలు విమర్శలూ వుండనే వున్నాయి. కోరి కోరి వాటిని మరింత పెంచుకోవడానికి అవకాశమిచ్చే నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం శ్రేయస్కరం. ఎంఎల్ఎలు ఎంఎల్సిలకు సదుపాయలు కలిగించడం తప్పు కాదు గాని ప్రజా సేవ అంటే సౌకర్యవంతమైన సౌఖ్యప్రద వ్యవహారంగా చూసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే రాజకీయాల పట్ల తగ్గుతున్న గౌరవం నిలబెట్టుకునేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది వ్యక్తిగత నిజాయితీలతో నిమిత్తం లేని పాలనా పరమైన వ్యవహారంగా చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎవరైనా వుండొచ్చు మారొచ్చు.