భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో బుధవారం ప్రారంభిస్తున్నారు. అది అద్దెకు తీసుకున్న కార్యాలయమే. సొంత భవనాన్ని వేరే చోట నిర్మిస్తున్నారు. అయితే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. మరో నాలుగైదు నెలలు పడుతుంది. అందుకే అద్దెకు తీసుకున్న కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందు కోసం కేసీఆర్.. అన్ని రాష్ట్రాల నుంచి భావసారూప్య పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు. ఎవరెవరు వస్తారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
తెలంగాణ నుంచి చాలా మంది సీనియర్ నేతలు వెళ్తున్నారు. మంత్రులు.. ఓ స్థాయిలో పదవులు ఉన్న వారంతా ఢిల్లీ చేరుకుంటున్నారు. అయితే ఒక్క తెలంగాణ నేతలతో మాత్రమే భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తే.. అది తెలంగాణ పార్టీ కార్యాలయంగానే ఉండిపోతుంది కానీ..జాతీయ పార్టీ కార్యాలయంగా ఉండదు. తమ పార్టీలో చేరాలనుకున్న లేదా.. తమ పార్టీ తరపున కన్వీనర్లుగా నియమించాలనుకున్న నేతలను.. పొత్తులు పెట్టుకోవాలనుకునే నేతలందర్నీ కేసీఆర్ ఢిల్లీకి రప్పించాల్సి ఉంది. అయితే వచ్చే వారు ఎవరన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు కూడా వచ్చే చాన్స్ లేదని చెబుతున్నారు. ఇక ఏ కార్యక్రమం పెట్టిన వస్తున్న కర్ణాటక నేత కుమారస్వామి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు రావడం వల్ల పెద్దగా ఉపయోగడం ఉండదని..ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నేతల్ని ఆకర్షించాల్సి ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నేతలు పెద్ద సంఖ్యలో కనిపిస్తే భారత రాష్ట్ర సమితిపై హైప్ పెరుగుతుంది. లేకపోతే.. మామూలుగా ఉండిపోతుంది.