ఎన్నికల్లో గెలవాలంటే.. నేను కంపెనీలు తీసుకొచ్చా…అభివృద్ధి చేశా.. భవిష్యత్లో మన రాష్ట్రం నెంబర్ వన్ గా ఎదగడానికి విత్తనాలేశాను అంటే.. ఇప్పుడు ప్రజలెవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరు.. నాకేంటి అంటున్నారు. అందుకే రాజకీయ పార్టీలన్ని సంక్షేమం పేరుతో… ఓటర్లకు వ్యక్తిగత లబ్ది చేకూర్చే పథకాలు ప్రవేశ పెడుతున్నాయి.
కేసీఆర్ కూడా ఇదే సంక్షేమ మంత్రంతో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ముందస్తుఎన్నికలకు ఇదే ధీమాతో కేసీఆర్ వెళ్ళారు.. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్కు గెలుపు కష్టమంటూ ప్రచారాలు జరిగాయ్. దీనితో తనదైన శైలిలో దూకుడుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలను మానేసిన కేసీఆర్ ప్రతి ఎన్నికల సభలోనూ తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. అంతే కాదు తిన్న రేవును మర్చిపోకూడదంటూ ఓ సభలో సెంటిమెంట్ టచ్ ఇచ్చారు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, కంటివెలుగు, రుణమాఫీపై స్పష్టమైన హామీలిచ్చారు. మళ్ళీ వస్తే మరింత మెరుగ్గా ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు కొన్నింటిని రెట్టింపు చేస్తామని కూడా ప్రకటించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తామేం చేసింది, చేస్తున్నదీ చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా 24 గంటల ఉచిత కరెంటు, పెన్షన్లు, రైతు బంధు పథకాలపై కేసీఆర్ చేసిన ప్రకటనలు గ్రామీణ ప్రాంత ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయి.. దీనితో టీఆర్ఎస్కు ఆయా ప్రాంతాల్లో స్థిరమైన ఓటు బ్యాంకు ఏర్పడింది. పోలింగ్ శాతం పెరిగిన తర్వాత ఓట్లన్నీ నెగెటివ్ అవుతాయనే ప్రచారం జరిగినా, చివరికి ఇవన్నీ టీఆర్ఎస్కే పోలయ్యాయని, అన్నీ పాజిటివ్ ఓట్లేనని తేలిపోయింది.
టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పథకాల్లో కీలకమైనవి రైతు బంధు, రైతు బీమా, ఇరవైనాలుగు గంటల కరెంట్ గా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు దాదాపు కొన్ని నెలల ముందు మేలో ప్రారంభించిన రైతు బంధు పథకం తెరాస తురుపుముక్క అని చెప్పవచ్చు. నేరుగా 58 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని సిద్ధం చేశారు. దీని కింద వచ్చే సొమ్ము కూడా చెక్కు రూపంలో అందజేయడం రైతులను ఆకర్షించింది. ఎన్నికల ముందే రెండో విడత చెక్కుల పంపిణీ కూడా టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. ఈ పథకం కింద ప్రస్తుతం ఎకరానికి 8వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతానన్న కేసీఆర్ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో అన్నదాతలు కారు గుర్తుకి ఓటేసి ముందుకురికించారు. కేసీఆర్ గత మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా కలిసొచ్చింది. 17 వేల కోట్లను ఈ పథకం కోసం వెచ్చించింది. దీనిని మరింత విస్తృతం చేసి లక్ష వరకు రుణమాఫీ చేస్తామనే నిర్ణయాన్నిటీఆర్ఎస్ ఈ మేనిఫెస్టోలో చేర్చింది. ఇవన్నీ ఓట్ల వర్షం కురిపించాయి.