గ్రేటర్ బాధ్యతలను తీసుకున్న కేటీఆర్ … సూపర్ సక్సెస్ అయ్యారు. అనుకున్నట్లుగా.. దాదాపుగా స్వీప్ చేశారు. గ్రేటర్ లో కాంగ్రెస్ కు రెండు సీట్లు మాత్రమే దక్కాయి. టీడీపీ వాష్ అవుట్ అయింది. గ్రేటర్ ఎన్నికల్లో చూపించిన ఫలితాలను రిపీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను తీసుకున్న కేటీఆర్.. సంపూర్ణ విజయాన్ని నమోదు చేశారు. టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరించిన మంత్రి కేటీఆర్ తనదైన మార్క్ చూపించారు. గ్రేటర్ లో ఉన్న 24 నియోజకవర్గాల్లో …బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఎంఐఎం ఏడు సిట్టింగ్ స్థానాల్లో విజయం సాధించింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించగలిగారు. ఇక అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు.
ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాదించింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న సెటిలర్లు అత్యధికమంది టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. సెటిలర్ల ఓటర్లపై ఆశపడిన టీడీపీ, కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. గ్రేటర్ విజయం వెనుక సెటిలర్లే కీలక పాత్ర పోషించారని స్పష్టమవుతోంది. ఆ పార్టీ తిరుగులేని విజయం సాధించడం వెనుక వారే కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్నస్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. సెటిలర్ల ఓట్లను రాబట్టుకోవడంలో కేటీఆర్ విజయవంతమయ్యారు.
తనదైన వ్యూహంతో పార్టీఅభ్యర్థుల గెలుపు కోసం ఆయన దాదాపు పదిరోజుల పాటు గ్రేటర్‌పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలతో దండయాత్ర చేశారు. అదేస్థాయిలో గ్రేటర్ పరిధిలోనూ మంత్రి కేటీఆర్ విపక్షనేతలు, కాంగ్రెస్ , టీడీపీ, టీజేఎస్ పార్టీలపై విమర్శలతో దాడి చేశారు. నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల్లో కేటీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రతిపక్షాలపై విమర్శలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్ల వర్షం కురిపించాయి. పెన్షన్లు, నిరుద్యోగులకు భృతి, వికలాంగుల పెన్షన్లు పెంచుతామన్న పలు రకాల ప్రకటనలు టీఆర్ఎస్ కు అనుకూలించాయి. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కేటీఆర్ ఇదే విధంగా అభ్యర్థుల ఎంపికను తన భుజాలపై వేసుకుని ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లోలా ఇప్పుడు కూడా విజయం సాధించారు.