దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకునే రాజకీయం ఇప్పుడు మరింత వికృత స్థాయికి చేరుకుంటోంది. జగ్గారెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నేతను అరెస్ట్ చేసినప్పుడు… దానికి కారణంగా చూపించిన ఓ నిందితుడి కన్ఫెషన్ రిపోర్టులో… హరీష్ రావు, కేసీఆర్ పేర్లు ఉన్నాయి. కానీ జగ్గారెడ్డిని మాత్రమే అరెస్ట్ చేశారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దగ్గర… తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చందిన రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసీఆర్ మొదట్లో.. బీజేపీపై విమర్శలు చేసేవారు. కానీ ఈ రెండు కేసుల్లో కొద్దిగా కదలిక తెచ్చి .. బీజేపీ ఆయనను గ్రిప్‌లోకి తెచ్చుకుంది.2015 దసరా ముందు రోజు.. కేసీఆర్ అధికార నివాసానికి సీబీఐ అధికారులు వచ్చారు. ప్రశ్నించి వెళ్లారు. అది ట్రైలర్ మాత్రమే. వెంటనే సీన్ అర్థమైపోయిన కేసీఆర్… అప్పటి వరకూ మోడీని తిట్టినా…ఆ తర్వాత నుంచి సీన్ మార్చేశారు. సంపూర్ణంగా మద్దతు పకలడం ప్రారంభించారు.
కేసీఆర్ రెండు సీబీఐ కేసులు ఉన్నాయి. కేసీఆర్ యూపీఏ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో తెలంగాణలో ఇ ఎస్ ఐ ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ఇచ్చారు. అసలు ఈఎస్ఐ.. ఫిషరీస్‌కి ఏమిటి సంబంధం అని ఆలోచించేలోపే… గూడుపుఠాణి బయటపడిపోయింది. ఇలా చేయడం వల్ల ఖజానాకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఓ కేసు నమోదైంది. ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై మొదట మత్స్యశాఖ ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి కేసు నమోదు చేశారు. అలా, 2011లో కేసు సీబీఐ చేతికి వచ్చింది. నిజానికి ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును మొదట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించారు. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ కు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేసి, ఫిషరీస్ శాఖకు అప్పగించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఆధారాలు కూడా రాబట్టారు. చివరికి అధికార నివాసానికి వచ్చి ప్రశ్నించి వెళ్లిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. చార్జిషీటు దాఖలు చేయకుండా.. కేసీఆర్ దారికి రావడంతో బీజేపీ పెద్దలు దాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టారు.
ఇదొక్కటే కాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. మరో పెద్ద అనుమానాస్పద నిర్ణయం తీసుకున్నారు. సహారా ఇండియా అవకతవకలపై ఇప్పటికే విచారణ జరుపిన సీబీఐ.. స్వయంగా పీఎఫ్ ఫండ్‌ను నిర్వహించుకోవడంపై ఆశ్చర్యపోయారు. అదెలా సాధ్యమని ఆరా తీస్తే.. అది కేసీఆర్ వద్దకు వచ్చి ఆగింది. స్వీయ పీఎఫ్ నిర్వహించుకోవడానికి సహారాకు కేసీఆర్ అనుమతి ఇచ్చారు. 20 ఏళ్ల వెనక నుంచి పీఎఫ్ నిర్వహణకు 2006లో కేసీఆర్ అనుమతులు ఇవ్వడంతో కార్మికులు సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టపోయారు. దీనిపై సీబీఐ విచారణ జరిపింది. అప్పట్లో కేసీఆర్‌కు వ్యక్తిగత దిలీప్‌కుమార్‌ను ప్రశ్నించారు కూడా. కానీ తర్వాత బీజేపీతో సత్సంబంధాల్లో ఉండటంతో.. అవి పక్కన పడిపోయాయి.
ఇప్పుడీ దిలీప్ కుమార్… తెలంగాణ జనసమితి పార్టీలో ఉన్నారు. ఆయన కూడా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆధారాలు బయటపెడతానని అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారు. అటు సహారా కేసులో.. ఇటు భవనాల నిర్మాణం కేసులోనూ.. సీబీఐ దగ్గర కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మోడీతో సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి బయటకు రావు. బహుశా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడు రేవంత్ ను వేటాడినట్లు .. వేటాడతారు కావొచ్చు.