తెలంగాణ సర్కార్‌పై కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని.. ఆ విషయాన్ని అసెంబ్లీని సమావేశర్చి లెక్కలతో సహా వివరిస్తామని కేసీఆర్ ప్రకటించి చాలా కాలం అయింది. డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ అన్నారు. ఆ ముచ్చటే రాలేదు. జనవరిలో కూడా రావడం లేదు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు. తర్వాత రిపబ్లిక్ డే. అయితే పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కానీ కేసీఆర్ సర్కార్ ఆ ఆలోచన మానుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కేంద్రం .. తెలంగాణ అడిగిన దాని కన్నా ఎక్కువ అప్పు పరిమితి మంజూరు చేసింది.
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ. 6,572 కోట్లు కావాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన పెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ. 9,572 కోట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంత కాలం అడిగిన దాన్ని కూడా ఇవ్వని కేంద్రం… ఇప్పుడు అడగకుండానే దాదాపుగా మూడు వేల కోట్ల అప్పు ఎందుకిచ్చింది ? తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలతో వెనక్కి తగ్గిందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంత చేసినా బడ్జెట్ ప్రతిపాదనలకు.. అప్పులకు మాత్రం చాలా తేడా ఉంది. రూ.53,970 కోట్ల రుణాలు తీసుకోవాలని బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టుకుంటే కేంద్రం ఇచ్చిన అనుమతి రూ.39,450 కోట్లు మాత్రమే. మిగతాది లోటులో పడిపోయింది.
కారణం ఏదైనా అనేక ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి … కేంద్రం కొత్తగా ఇచ్చిన అనుమతి… మాత్రం ఊరట నిచ్చేదే. ఇది రాజకీయ పరిమామాలతో జరిగిందా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇంత కాలం ఆపడం వల్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది. అయితే ఇప్పుడు మళ్లీ కేంద్రాన్ని అసెంబ్లీ సమావేశం ఎర్పాటు చేసి మరీ నిందించడం కంటే… ఒక్క సారి బడ్జెట్ సమావేశాల్లో చెప్పాలనుకున్నది చెబితే సరిపోతుంది కదా అనే వాదన ఎక్కువ మందిలో వినిపిస్తోంది.