” దేశంలో ఉన్న కొత్త చట్టాలు.. రైతులు తమ పంటల్ని ఎక్కడికైనా వెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొనాల్సిన పని లేదు.” ఈ మాట అన్నది తెలంగాణ సీఎం కేసీఆర్. కొద్ది రోజుల కిందట.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ రైతు.. ఢిల్లీకెళ్లి అమ్ముకోగలడా..? అని హైపిచ్‌లో ప్రశ్నించింది కూడా కేసీఆరే. కానీ.. అది గ్రేటర్ ఎన్నికలకు ముందు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల తర్వాత మాట మారింది. వ్యవసాయ చట్టాలకు పరోక్షంగా అయినా అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించారు. వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వాయిస్ మారుతోంది. రైతులకు మద్దతుగా భారత్ బంద్‌ను అధికారికంగా నిర్వహించిన సీఎం కేసీఆర్.. తర్వాత సైలెంటయ్యారు. భారత్ బంద్ రోజు.. రోడ్డెక్కి ఆందోళన చేసిన కేటీఆర్, కవిత సహా టీఆర్ఎస్ నేతలందరూ.. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ చట్టాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఒకేసారిమద్దతు తెలిపితే విమర్శలు వస్తాయని అనుకున్నారేమో కానీ.. ఆ చట్టాల వల్ల ఉపయోగం ఉందన్నట్లుగా రైతులకు సలహాలిస్తున్నారు. రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి నగదును ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షలో కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయం చేయాల్సిందేనని రైతులపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం.. ఇక అవసరం లేదని తేల్చేసింది. రైతులు.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట వేసుకోవచ్చని కేసీఆర్ ప్రకటించేశారు.
ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నేరుగా పంటలు కొనుగోలు చేయడం వల్ల ఏడున్నర వేల కోట్లు నష్టపోయిందని అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఈ సారి పంటలు కొన్నదని.. ప్రతీసారి అలాగే చేయడం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి కేసీఆర్ మాటల్లో తేడా చాలా స్పష్టంగా ఉందన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.