తెలంగాణ సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిస్థితిపై టెన్షన్‌కు గురవుతున్నారు. హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర జరుగుతోందని.. ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని ప్రకటించారు. జిల్లాల్లో గొడవలు రాజేసి హైదరాబాద్‌కు విస్తరించాలని చూస్తున్నారు..ప్రార్థన మందిరాల వద్ద వికృత చేష్టలు చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఎందుకు అంటే.. గ్రేటర్ ఎన్నికల్లో లబ్దిపొందడానికి.. ఎన్నికలు వాయిదా వేసేందుకు కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని.. సంఘ విద్రోహశక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువతను కేసీఆర్ కోరారు
తెలంగాణలో శాంతిభద్రతలపై ప్రత్యేకంగా సమీక్ష చేసిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పీఆర్ టీం ద్వారా.. వీటిని మీడియాలో విస్తృతంగా కవర్ అయ్యేలా చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఉన్న ఓ రకమైన ఉద్వేగ పరిస్థితుల నడుమ కేసీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపడం సహజమే. దీనిపై అందరూ రకరకాలుగా విశ్లేషించుకుటున్నారు. టీఆర్ఎస్ మద్దతుదారులు బీజేపీ నేతలు కుట్రలు పన్నారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టి.. రాజకీయంగా లాభపడే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఖచ్చితమైన ఇంటిలిజెన్స్ సమాచారం ఉండబట్టే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
అదే బీజేపీ నేతలు మాత్రం.. ఓటమి భయంతో.. ఎన్నికలను వాయిదా వేసేందుకు కేసీఆర్ మతకల్లోలాల పేరుతో కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికకు ముందు కేటీఆర్ చేసిన ఇలాంటి ఆరోపణలనే బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక ముందు ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య కేంద్రంగా.. హైదరాబాద్‌లో అల్లర్లకు.. కాల్పులకు దారి తీసే ప్లాన్‌ను బీజేపీ అమలు చేస్తోందని.. ఈ మేరకు బండి సంజయ్ తన క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ ప్రకటించారు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ అలాంటివేమీ జరగలదేని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా.. శాంతిభద్రతల సమస్య పేరుతో..మైండ్ గేమ్ ఆడి.. ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంటే కుట్రదారుల్ని వెంటనే అరెస్ట్ చేయడం పోలీసుల బాధ్యత. అలా చేయకపోతే సమాజానికి హాని చేసినట్లే అవుతుంది. కానీ పోలీసులు ఇంత వరకూ ఎవరినీ.. మత కల్లోలాలు రేపే అభియోగాలపై అదుపులోకి తీసుకోలేదు. తన వ్యాఖ్యలన్ని కేసీఆర్ పొలిటికల్ గేమ్‌లో భాగంగానే చేసి ఉంటే.. దుబ్బాకలోలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగిపోతాయి. కానీ ఖచ్చితమైన సమాచారం నిజం అయితే మాత్రం.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది.