హుజూరాబాద్ ఉపఎన్నికల విషయంలో పార్టీ నేతలు రిలాక్స్ అయ్యారని ఆందోళన చెందుతున్నారు. ఉపఎన్నికల షెడ్యూల్ ఇప్పుడల్లా రాదన్న సూచనలు రావడంతో చాలా మంది నేతలు హుజూరాబాద్‌ను వదిలి పెట్టారు. సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ అందర్నీ ప్రగతి భవన్‌కు పిలిచి ఆలసత్వం వద్దని హెచ్చరించి పంపించారు. హరీష్ రావు సహా హుజూరాబాద్ బాధ్యతలు చూస్తున్న ముఖ్యనేతలందర్నీ పిలిచిన కేసీఆర్.. తాజా సర్వే రిపోర్టులు వారి ముందు పెట్టి… ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా పరిస్థితి చేజారుతుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
ఇన్చార్జీలు ఉప ఎన్నిక ముగిసేంత వరకు బాధ్యతలు అప్పగించిన చోట ఎక్కడివారక్కడే ఉండాలని.. ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరేలా చేయడే కాకుండా.. ఒక్కో ఓటర్ని ప్రత్యక్షంగా పది రోజులకోసారి కలిసేలా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందనే అంశాన్ని మర్చిపోవాలని.. రేపే విడుదలవుతుందన్నట్లుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇప్పటికే హుజూరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే నెల మొదటి వారానికల్లా పూర్తి కావాలని.. దళితబంధుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ లబ్ధి జరిగేలా చూస్తామనే అంశాన్ని దళితుల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అవసరమైతే మరోమారు హుజూరాబాద్‌లో పర్యటిస్తానని పార్టీ ఇంచార్జ్‌లకు స్పష్టం చేశారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో ప్రచారం తగ్గిపోయింది. పార్టీల నేతలు ప్రెస్మీట్లకు పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి టీఆర్ఎస్ను ఎప్పట్లాగే యాక్టివ్‌గా ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారు.