తెలంగాణ సీఎం కేసీఆర్కు ఇప్పుడు సన్నబియ్యం టెన్షన్ పట్టుకుంది. నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా ప్రభుత్వం సూచించినట్లే రైతులు పంటలు వేశారని ఆయన ఘనంగా ప్రకటించారు. ఈ నియంత్రిత విధానంలో భాగంగా.. పెద్ద ఎత్తున రైతుల సన్నబియ్యం రకాలను పండించారు. పంట చేతికి వచ్చింది.ఇప్పుడు.. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే.. కొత్తగా రైతులు ప్రభుత్వం చెప్పినట్లే పండించినందున తమకు సన్నాల రకాలకు రూ. 2500 మద్దతు ధర ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతున్నాయి. పెద్ద ఎత్తున బియ్యం పండించిన రైతులు ఇప్పుడుప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్నారు.
నియంత్రిత సాగులో సన్నాలకు ప్రోత్సాహం ఇవ్వడంతో తెలంగాణలో పండించే వరిలో 85-90శాతం సన్నాలే సాగయ్యాయి. సాధారణంగా దొడ్డు రకాల కన్నా సన్నాల సాగుకు ఎకరానికి రూ.7వేల చొప్పున పెట్టుబడి ఎక్కువవుతుంది. గతంలో సన్నాలకు మిల్లర్లు క్వింటాకు రూ. రెండు వేలు ఇచ్చేవారు.ఇప్పుడు భారీగా దిగుబడి రావడంతో ఇప్పుడు రూ. 1500 కూడా ఇవ్వలేమన్నట్లుగా ఉన్నారు. దీంతో రైస్ మిల్లులకు ప్రసిద్ధి చెందిన మిర్యాలగూడ మొత్తం ధాన్యం ట్రాక్టర్లతో నిండిపోయింది. సన్నాల సాగును ప్రోత్సహించిన ప్రభుత్వం మద్దతు ధర విషయంలో మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
ప్రభుత్వం క్వింటాకు రూ.1888 మద్దతు ధరను ప్రకటించింది. అది దొడ్డు బియ్యానికి ఇచ్చే మద్దతు ధరే. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగినందున ఇది సరిపోదని, రూ.2,500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ చెప్పినట్లే పంటలు సాగు చేశామని.. ఇప్పుడు మద్దతు ధర ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఆయనదేనని రైతులు అంటున్నారు. లేకపోతే ఉద్యమానికి సిద్ధమని చెబుతున్నారు. గతంలో మొక్కజొన్న రైతులు ఉద్యమం ప్రారంభించడంతో ప్రభుత్వం చెప్పకపోయినా సాగు చేశారని.. అయినాకొనుగోలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు వరి రైతులు.. తాము ప్రభుత్వం చెప్పినందునే పంటలు వేశాం కాబట్టి.. కొనుగోలు చేసి తీరాల్సిందేనంటున్నారు.