తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నా అని ఎప్పుడు బహిరంగసభ లో ప్రసంగించాల్సి వచ్చినా చెబుతున్నారు. కానీ ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు వెళ్తారో ఎలా వెళ్తారో కూడా ఎవరికీ అర్థం కాకుండా ఉంది. కలెక్టరేట్లను ప్రారంభించడానికి జిల్లాలకు వెళ్తున్న ఆయనఅక్కడ పార్టీ పరంగా కూడా బహిరంగ సభలు ఏర్పాటుచేసి ఎక్కువగా కేంద్రంపైనే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో రైతులకు ఏం చేశారో దేశం మొత్తం అదే చేస్తానని చెబుతున్నారు. అయితే ఆ విషయం తెలంగాణ రైతులకు చెబితే ప్రయోజనం ఏమిటనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం.
మొదటి సారి ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆలోచన చేశారు. అప్పట్నుంచి అదే పనిగా దేశం మొత్తం తిరుగుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లో ఆయా రాష్ట్రాలకు వెళ్లడం.. మాట్లడటం .. రావడం కామన్ అయిపోయింది కానీ ఒక్కరంటే ఒక్కరూ కలిసి కూటమి కడదామని దగ్గరకు రాలేదు. అలా రావడం లేదని జాతీయ పార్టీ పెడతానంటున్నారు. అయితే బీహార్ పర్యటన తర్వాత ఆయనకు ఉత్తరాదిలో ఆదరణ లభిస్తుందని ఎక్కువ మంది నమ్మలేకపోతున్నారు.
త్వరలో యూపీ పర్యటనకు కేసీఆర్ వెళ్తారని.. అక్కడే భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ లోకల్ పార్టీల మద్దతు లేకుండా.. తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ బహిరంగసభ ఏర్పాటు చేయడం అనేది ఎలా సాధ్యమో టీఆర్ఎస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు. కేసీఆర్ వచ్చి తమ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి పెంచుకుంటానంటే వారెందుకు ఒప్పుకుంటారు ?. కేసీఆర్ ఇప్పటికీ తన రాజకీయాలను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లలేదు. కొన్ని ప్రకటనలు ఇవ్వడం మినహా చేసిందేమీలేదు. మరి తెలంగాణ ప్రజల ముందు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏమిటో ?