కొత్త వివాదాలు కొని తెచ్చుకుంటున్న కేసీఆర్ !
ఆరు దశాబ్దాల కల నెరవేరి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్ల పూర్తి కావస్తోంది. బంగారు తెలంగాణ సాధించాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మౌలిక సదుపాయాలు మొదలుకుని రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధనకు చాలా కష్టపడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో వనరులను, సమయాన్ని, శక్తిని దానికోసమే వెచ్చించాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటుపై చాలా హడావుడి పడుతున్నారు. అసలే ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల కు కొరత ఉంది. కొత్తగా జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు కనీసం ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తారు? ఒక్కొక్కరికి రెండు జిల్లాల బాధ్యతలు అప్పజెప్తే, ఆ మాత్రానికి జిల్లాలను పెంచడం ఎందుకు?
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తప్పని ఎవరూ అనరు. అయితే, కొత్త రాష్ట్రం. పూర్తిగా గాడినపడాల్సి ఉంది. పాత వాసనలు పూర్తిగా పోవాల్సి ఉంది. జరిగిన తప్పులను సరిదిద్దాల్సి ఉంది. రైతులు, ప్రజలందరికీ సాగు, తాగునీరు అందించాల్సి ఉంది. ఇంకా అనేక సవాళ్లున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి. కనీసం మొదటి ఐదేళ్లూ పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టి, ఆ తర్వాత కొత్త జిల్లాల వంటి అనుత్పాదక అంశాలు చేపట్టవచ్చు.
ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చాలా పెండింగ్ అయిపోయి, ప్రభుత్వ కాలేజీలు సమ్మె వరకూ వెళ్లాల్సి వచ్చింది. అత్యవసరమైన ఆరోగ్య శ్రీ చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం చాలా కాలం నిర్లిప్తంగా ఉంది. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసి సమ్మె మొదలుపెట్టిన తర్వాత సర్కారు దిగివచ్చింది.
గుజరాత్ తర్వాత మాదే సంపన్న రాష్ట్రమని కేసీఆర్ పదే పదే చెప్తారు. కానీ గత రెండేళ్లలో సంపన్న రాష్ట్రం కాస్తా పేద రాష్ట్రంగా మారుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సంపన్న రాష్ట్రం అయినంత మాత్రాన, అత్యవసరం కాని వాటికి నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు. గుజరాత్ లో మద్య నిషేధం అమల్లో ఉంది. అంటే మద్యం ఆదాయం ప్రభుత్వానికి రాదు. తెలంగాణలో మద్యం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. అయినా చెల్లింపుల విషయంలో జాప్యం ఎందుకో అర్థం కాదు.
ఒక్కచోట డబుల్ బెడ్ రూం ఇళ్ల కాంప్లెక్స్ కట్టి, ఐదారు ఎన్నికల్లో దాన్నే ట్రంప్ కార్డులా వాడుకున్నారు. ఆ తర్వాత ఇంత వరకూ అతీగతీ లేదు. పక్కాఇళ్లు కట్టిస్తామని కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరులో ఉన్న ఇళ్లను కేసీఆర్ చెప్పారని కూల్చేశారు. ఆ కుటుంబాల వారు టెంట్లలో ఉండే పరిస్థితి కారణం కేసీఆర్ అనాలోచిత విధానాలే అని విపక్షాలు దుయ్యబట్టాయి.
తెలంగాణలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ జిల్లా పెంపు ప్రాధాన్యంగా తీసుకోవడం వల్ల అశాంతి ప్రబలే అవకాశం ఉంది. కొత్త జిల్లాల కోసం ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఆందోళన హింసాత్మకంగా మారింది. కరీంనగర్ జిల్లాతో సహా పలుచోట్ల బలమైన డిమాండ్లు వినవస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక బంద్ లు రాస్తారోకోలు ఉండవని ప్రజలు భావించారు. కానీ కొత్త జిల్లా డిమాండ్లతో మళ్లీ ఆందోళనలు, బస్సుల దహనాలు జరుగుతాయేమో అని ప్రజలు భయపడుతున్నారు. రెండేళ్లకే కొత్త జిల్లాల కోసం వెంపర్లాట అవసరమా అనేది కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.