కేసీఆర్ సీఎంగా ఉండగా అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్న విమర్శ బలంగా ఉంది. కేసీఆర్ తాను కలవాలి అనుకున్న వారిని తప్పా ఎవరినీ కలవడని, కేసీఆర్ కు చెప్పేవారు కూడా ఎవరూ ఉండరనేది బీఆర్ఎస్ లోనూ బలంగా వినిపించేది. కానీ, పార్టీ ఓటమి తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా?
లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రచారం, స్థానికంగా బస, లోకల్ లీడర్లతో పాటు జనాన్ని కలిశారు. మార్పు తెస్తాం అన్న రేవంత్ సర్కార్, కేసీఆర్ లోనూ మార్పు తెచ్చిందన్న సెటైర్లు కూడా అప్పుడు వినిపించాయి. కానీ, ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడా కనపడలేదు.
తాజాగా… తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏండ్లు అవుతుంది. పదేండ్ల పండుగను ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించటంతో పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా ఉన్న కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ కు అప్పజెప్పారు.
కానీ, వేణుగోపాల్ ఎంత ప్రయత్నించిన కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకట్లేదట. గురువారం సాయంత్రం నుండి తాను కేసీఆర్ ను కలిసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకట్లేదని, కలవకూడదని అనుకున్నారేమో అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంగా వేడుకలు చేస్తున్నారని ఆరోపిస్తుండగా… కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సోనియాగాంధీ వల్లే తెలంగాణ కల సాకారం అయ్యిందని ఒప్పుకున్నారని, అలాంటప్పుడు ఆమెను పిలిచి గౌరవిస్తే తప్పేందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇంకా రెండ్రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆహ్వానాన్ని కేసీఆర్ గౌరవిస్తారా… అసెంబ్లీకి డుమ్మాకొట్టినట్లే ఇప్పుడు కూడా డుమ్మా కొడతారో చూడాలి.