హైదరాబాద్: తెలంగాణ ఏర్పడితే మన పాలన వస్తుందని, కష్టాలు, కన్నీళ్ళు తొలగిపోతాయని, అంతటా ఆనందం, హాయి వెల్లివిరుస్తాయంటూ నాడు అరచేతిలో వైకుంఠం చూపించారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ రాదని, శాశ్వతంగా సీమాంధ్రుల దోపిడిలో బతకాల్సిందేనని హెచ్చరించారు. ఉద్యమం బలపడాలంటే ఆ మాత్రం సెంటిమెంట్ ఉండాలి కాబట్టి నాడు ఆయన అనుసరించిన విధానం అప్పటికి కరెక్టే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొనే విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరే ప్రశ్నార్థకంగా మారుతోంది.
మొన్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే ‘పనికిమాలిన సమ్మెలు’ అంటూ మండిపడి ఉద్యోగాలనుంచి తొలగించారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలను ఆపటానికి రుణమాఫీని ఒకే విడతలో చేయాలని ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగితే ‘అలవికాని కోర్కెలు’ అని దుయ్యబట్టి సస్పెన్షన్ చేయించారు. నాడు ఈ సమ్మెలు నిరంతరంగా చేయబట్టే తెలంగాణ ఉద్యమంలో వేడి పుట్టిన విషయం మరిచిపోయారు. ‘సకల జనుల సమ్మె’ అని, ‘మిలియన్ మార్చ్’ అని నెలలపాటు సమ్మెలు, బంద్‌లు చేసినపుడు – పిల్లల చదువు పాడయిపోయిందని, బిజినెస్ పాడయిందని తల్లిదండ్రులు, వ్యాపారులు, రోజువారీ కూలీలు బాధపడినాకూడా తెలంగాణ వస్తుందని అందరూ భరించి ఉద్యమానికి సహకరించిన విషయం గుర్తులేదా.
ఇక తాజాగా, తెలంగాణను పట్టి కుదిపేస్తున్న రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీయటంపైకూడా కేసీఆర్ మండిపడ్డారు. ధిక్కారము సైతునా అంటూ హుంకరించారు. ప్రతిపక్షాలు చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకోవటమా అన్నారు. సభను అడ్డుకోవాలని చూస్తే ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసని చెప్పారు. మొత్తం ప్రతిపక్ష సభ్యులను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేశారు. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు లేకుండా సభను తమకు తామే నడుపుకోవటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఉందని అంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కార్యకలాపాలకు అడ్డుపడుతుంటే ఒక గంటో, రెండు గంటలో సభను వాయిదా వేయటం, అప్పుడూ కుదరకపోతే సభ్యులను ఒక రోజుకో, రెండు రోజులకో సస్పెండ్ చేయటం సహజం. ఇలా సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయించటం కేసీఆర్ అసహనాన్ని, నిరంకుశ ధోరణిని ఎత్తిచూపుతున్నాయి. అందులోనూ సంక్షోభ స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలపైనే ఇలా వ్యవహరించటంతో ఆ సమస్య పరిష్కారంపట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిపై సందేహాలు తలెత్తుతున్నాయి.
అసలు వ్యవసాయం ఇంత సంక్షోభ స్థాయికి చేరితే కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకూ దీనిపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఏదీ తయారుచేయకపోవటం విచిత్రంగా ఉంది. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్నయినా పరామర్శించిన పాపాన పోలేదు. ఈ ఆత్మహత్యలను ఆపటానికిగానూ తక్షణమే స్పందించేలా పది జిల్లాలలో(ఈ పదింటిలో హైదరాబాద్, రంగారెడ్డిలలో ఎలాగూ వ్యవసాయం నామమాత్రంగానే ఉంటుంది) కలెక్టర్ల నేతృత్వంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండేది. ఆ పనికూడా చేయలేకపోయారు. ఈ ఆత్మహత్యల పాపం గతపాలకులదేనంటూ కిందనుంచి పైదాకా ప్రభుత్వంలోని ప్రతిఒక్కరూ ఒకటే ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నారు(ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరనుంచి ప్రతిఒక్కరూ గత ప్రభుత్వాలలో పనిచేసిన వారే). మరి గత పాలకులు వదిలి వెళ్ళిన మిగులు బడ్జెట్ గురించి మాత్రం చెప్పటంలేదు. ఆ మిగులు బడ్జెట్ వలనేగా తెలంగాణ ధనిక రాష్ట్రమయింది. ఆ మిగులు బడ్జెట్‌నుంచి నిధులు తీసి రుణమాఫీకి విడుదల చేయొచ్చుకదా! ఆర్టీసీ కార్మికులకు అడిగినదానికంటే ఎక్కవ ఇచ్చారు బాగానే ఉంది. మరి రైతులేం పాపం చేశారు. స్కూల్ ఫీజు కట్టలేక ఒక రైతు కొడుకు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంటే అది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన ఘటనకాదా. కరీంనగర్ జిల్లా అబ్బాపూర్ గ్రామంలో చనిపోయిన ఆ కుర్రాడి కుటుంబాన్నయినా ప్రభుత్వ పెద్దలు పరామర్శించలేదు.
ఆయన అనుకున్న ప్రాజెక్టులకు మాత్రం నిధుల వరద పారుతోంది. ఎర్రవల్లి, నర్సన్నపేటలలో కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దీనికి నిదర్శనం. ఇక హుస్సేన్ సాగర్ ఒడ్డున 153 అంతస్తులతో సిగ్నేచర్ టవర్ పేరుతో పెద్ద ఆకాశహర్మ్యం కట్టాలని యోచిస్తున్నారట. ఇలాంటి పెట్ ప్రాజెక్టులను ఎన్నింటినో కేసీఆర్ సూచనలమేరకు అధికారులు డిజైన్ చేస్తున్నారు. మౌలికమైన సమస్యలు వదిలి ఇలా పెట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టటం అయన మనస్తత్వాన్ని చెప్పకనే చెబుతోంది. అధికారం చేతిలో ఉందికదా అని అహంకారపూరితంగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన శాస్తి చెబుతారని చరిత్ర చెబుతున్న గుణపాఠాలు వేలసంఖ్యలో పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుండకపోవటం విచారకరం!