తన కూతుర్ని కూడా బీజేపీలో చేరమని అడిగారని కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల్ని కవిత సమర్థించారు. తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనన్నారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారన్నారు. ” షిండే మోడల్ ” అంటే.. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే .. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతో పాట తీసుకు పోయి.. తనదే శివసేన అని ప్రకటించుకున్నట్లుగా రాజకీయం మార్చడం. కవితను అలా షిండే తరహాలో రాజకీయం చేయాలన్న ఆఫర్ ఇచ్చినట్లుగా కవిత చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లోనూ షిండేలు ఉన్నారని గతంలో బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రకటించారు. వారంతా సమయం చూసి బయటకు వస్తారని ప్రకటించారు. ఈ షిండేల వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇదేం పద్దతని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడి వెళ్తే ఓ పది మంది వెళ్తారని అంతే కానీ.. షిండేల్లా ఎవరూ ఉండరన్నారు. అయితే ఆ షిండేను నేరుగా కేసీఆర్ కుటుంబం నుంచే వచ్చేలా ప్రయత్నించిందని బీజేపీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఎవరు సంప్రదించారు ? ఎలాంటి చర్చలు జరిగాయి ? అన్న వివరాలను కవిత ఇంకా బయట పెట్టలేదు.
దీనిపైనే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఫామ్ హౌస్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ తక్షణం … కవితను పిలిపించి స్టేట్ మెంట్ నమోదు చేసుకుని ఎవరు ఆమెను సంప్రదించారో తెలుసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే..బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న నాటకమే ఇదంతా అనుకోవాల్సి వస్తుందన్నారు. కవిత నేరుగా చెప్పారు.. తమను సంప్రదించారని.. అలాంటప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదనేది ఇప్పుడు కీలకం. అయితే ఈ విషయాలను సిట్ చీఫ్ పట్టించుకుంటారా అన్నదే ఇప్పుడు ప్రశ్న.