భారతీయ రాష్ట్ర సమితి ద్వారా ఢిల్లీలో జెండా పాతాలనుకుంటున్నకేసీఆర్ ముందుగా రాజశ్యామల యాగంతోనే ప్రారంభించాలని నిర్ణయించారు. 14న ఢిల్లీలోని సర్దార్‌పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సోమవారమే కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు. మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగ నిర్వహణ , ఏర్పాట్ల కోసం.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజ ముందుగానే ఢిల్లీ వెళ్లారు.
రాజశ్యామల యాగం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోందన్న వియం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా రాజశ్యామల యాగం అంటే.. తన ఆధ్వర్యంలోనే జరగాలన్నంతగా ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు విశాఖ శారాదా పీఠం స్వరూపానంద. అయితే ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాల కోసం చేస్తున్నది కాదు కాబట్టి.. ఢిల్లీలో అధికారం కోసం చేస్తున్నారు కాబట్టి.. అక్కడి పండితులతోనే చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజశ్యామలయాగం చేసిన ప్రతీ సారి .. కేసీఆర్ విజయాన్ని అందుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
కేసీఆర్ యాగంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఎన్ని యాగాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను దేవుడు కూడా క్షమించబోడని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తప్పులను తెలంగాణ సమాజం గ్రహిస్తుందని అన్నారు. కేసీఆర్ రాజశ్యామల యాగం చేసినా ఫలితం ఉండబోదని, దేవుడు ఆయన్ని కాపాడలేడని హెచ్చరించారు.