ఊరూవాడా ఆనందం తాండవించే దసరా సీజన్ మొదలైంది. తెలంగాణలో దసరా సంబురం అంబారన్నంటుతుంది. దానికి ముందు బతుకమ్మ వేడుకలతో తెలంగాణ ఆడపడుచులు కష్టాలను మరిచిపోయి రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో, ఆటపాటలతో ఆనందంగా గడిపే రోజులివి. అలాగే, తెలంగాణలోని పేదలకు మరో శుభవార్త. పేదల కోసం రెండు పడక గదుల నిర్మాణానికి దసరా నాడే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. అవినీతికి తావులేకుండా ఇండ్ల నిర్మాణం జరగాలని స్పష్టంగా ఆదేశించారు. ఈ పథకం విధి విధానాలు నిర్దేశించారు.
ఈ ఏడాది 60 వేల ఇండ్లను నిర్మించాలనేది కేసీఆర్ లక్ష్యం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 36 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇండ్లను నిర్మిస్తారు. ఇండ్ల మంజూరు అధికారం పూర్తిగా రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం అక్కడి ఎమ్మెల్యే మంజూరు చేస్తారు. మిగతా 50 శాతం ఆ జిల్లా మంత్రి మంజూరు చేస్తారు. కాబట్టి ఈ విషయంలో అధికారుల ప్రమేయం ఉండదు. నిర్మాణం సాఫీగా జరిగేలా చూడటమే వారి బాధ్యత. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో వారు మంజూరు చేస్తారా మరే విధానమైనా ఉందా అనేదానిపై స్పష్టత లేదు. పార్టీ ఏదైనా ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ అయితే ఆ విషయం స్పష్టం కావాల్సి ఉంది.
ఎంపిక మొత్తం రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది కాబట్టి తమ పార్టీ వారికే ప్రయోజనం కలిగించాలనే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అర్హులైతే పరవాలేదు. అనర్హులైన తమ పార్టీ వారికి మంజూరు చేస్తే, నిజమైన పేదలకు అన్యాయం జరుగుతుంది. ఇండ్ల నిర్మాణంలో అవినీతిని సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. అసలు మంజూరులోనే అక్రమాలు జరిగితే ఏం చేస్తారనేది చెప్పలేదు.
అధికారుల ప్రమేయం, అర్హతలకు సంబంధించిన విధి విధానాలు లేకుండా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులకే అధికారాలను ధారాదత్తం చేయడం సబబా అనే సందేహాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన పేదలకే ఇండ్లను నిర్మించి ఇచ్చేలా కేసీఆర్ సఫలమైతే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఇప్పటి వరకూ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అగ్డిపెట్టెల్లా ఉన్నాయని కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. 2 బెడ్ రూం ఇల్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వడం అరుదైన విషయం. సరిగ్గా అమలైతే ఇది తెలంగాణలో అన్నింటికంటే అత్యుత్తమమైన పథకం కావచ్చు.