హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పథకమైన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మళ్ళీ మొదటికొచ్చింది. ఈ కార్యక్రమం తమవల్లకాదంటూ జీహెచ్ఎమ్సీ చేతులెత్తేసింది. సరస్సులోని నీటినన్నింటినీ తోడేసి, మేటలను, చెత్తను తొలగించి అడుగునున్న ఉపరితలాన్ని శుభ్రం చేయాలన్నది కేసీఆర్ ప్రతిపాదన. జీహెచ్ఎమ్సీ చేతులెత్తేయటంతో దీనిపై వియన్నాలోని ఆస్ట్రియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏఐటీ) సలహాలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఏఐటీ సంస్థ ప్రతినిధులు ఇటీవల నగరానికి వచ్చి హుస్సేన్ సాగర్ సరస్సును, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. దీనికి పరిష్కారం చూపటానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేయటానికి 1 లక్ష యూరోలు తీసుకుంటామని తెలిపారు. వారు పరిష్కారంచూపటంలో సిద్ధహస్తులే అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే అయ్యేదికాదని తెలియటంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఏఐటీ సంస్థ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించటానికే కనీసం మూడునెలలు పడుతుందని, ఆ ప్రాజెక్ట్ను అమలుచేయటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అసలు సరస్సును ప్రక్షాళన చేయాలంటే దానికి ముందు, సరస్సులోకి మురుగునీరు రాకుండా నిరోధించటంవంటి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని తెలిపాయి.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు గత ప్రభుత్వాలుకూడా ఎన్నోకోట్లు ఖర్చుపెట్టాయి. 2008లో జైకా సంస్థద్వారా రు.320కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశారు. అయితే ఎన్నివందలకోట్లు ఖర్చుపెట్టినా ప్రాజెక్ట్మాత్రం సత్ఫలితాలు ఇవ్వటంలేదు.