తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోనచ చేస్తున్నారు. ఎందుకు ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారనేదానిపై.. ఆనేక రకాల విశ్లేషణలు వస్తున్నాయి. వీటిలో.. పార్లమెంట్ తో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే… జాతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ అన్న వాతావరణం వచ్చే అవకాశం ఉంది. అలా కాకపోతే… మోడీ, మోడీ వ్యతిరేక శక్తుల మధ్య పోటీ అన్నట్లుగా మారవచ్చు. దానితో పాటు.. ఏడాది చివరిలో జరగనున్న మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే… ఆ పార్టీకి పాజిటివ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు కొత్తగా.. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తర్వాత చర్చల్లోకి వస్తున్న అంశం కేటీఆర్ పట్టాభిషేకం.
కేటీఆర్ పట్టాభిషేకం కోసం కేసీఆర్ ప్లానేశారా..?
కేటీఆర్ పట్టాభిషేకానికి .. ముందస్తు ఎన్నికలకు సంబంధం ఉందని.. ఎవరూ ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ.. కేసీఆర్ మాటలను బట్టి… కేటీఆర్ పట్టాభిషేకానికి కూడా.. ముందస్తు సన్నాహాలున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కావడం లేదు. సాక్షాత్తూ.. కేసీఆర్ తో సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలకు కూడా.. తాజా రాజకీయ పరిణామాలపై క్లారిటీ లేదు. ముందస్తుకు వెళ్తారా లేదా.. వెళ్తే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారన్నదానిపై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్లారిటీ లేదు. అందుకే వారు కూడా.. ఇతర మార్గాల్లో సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తితో ఉన్నారా..?
కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది గనుకనే.. ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకు వచ్చారు. అయినా.. తెలంగాణ రాజకీయాలపై.. ఫెడరల్ ఫ్రంట్ ప్రభావం చూపిస్తుందేమోనని.. కాస్తంత వెనక్కి తగ్గారు. ఎందుకంటే..కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకు రాగానే… కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రారంభించింది. ఫెడరల్ ఫ్రంట్.. బీజేపీ కోసం పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణ చేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రులుగా ఉన్న వారినో… మిత్రులుగా అవుతారని భావించిన వారినో మాత్రమే కలిశారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న పార్టీలను కానీ.. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్న పార్టీలను కానీ కలవ లేదు. అసెంబ్లీకి ముందస్తు ఆలోచన చేస్తున్నారు కాబట్టి.. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఆలోచనతో.. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను డీప్ ఫ్రిజ్ లో పెట్టారని భావించవచ్చు. మళ్లీ కేసీఆర్ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకు రావొచ్చు.
బీజేపీ కోసం పార్టీలను వెదికి పెడుతున్న కేసీఆర్..?
ఒక వేళ తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ గురించి ఐదారు నెలలు సమయం కేటాయించవచ్చు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయడం ద్వారా.. బీజేపీకి దగ్గర కావొచ్చు. వాజ్ పేయి సమయంలో చంద్రబాబు అలా ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఎవరున్నారు..?. ఇప్పుడు బీజేపీ బలం తగ్గుతోంది. కాబట్టి.. ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెస్తే..కేసీఆర్.. కీలక పాత్ర పోషించవచ్చు. బీజేపీ బిజూజనతాదళ్ తో పాటు.. డీఎంకేనూ కలుపుకోవాలని చూస్తోంది. రజనీకాంత్ ఊపు లేదు. కమల్ హాసన్ వచ్చే అవకాశం లేదు. తమిళనాడులో డీఎంకేకు ఊపు ఉండవచ్చు..అని బీజేపీ అంచనా వేసింది. కరుణానిధి.. సంతాప సభకు..నేరుగా అమిత్ షానే వెళ్తున్నారు. నిజానికి వెళ్లదల్చుకుంటే… నిర్మలాసీతారామన్.. లాంటి వాళ్లు వెళ్లవచ్చు. అమిత్ షా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ వెళ్తున్నారు. ఇదే కాదు.. గతంలో.. మోడీ.. కరుణానిధిని కలిసి వచ్చారు. టూజీ కేసు తీర్పుకు ముందు అదే జరిగింది. అందుకే ఇలాంటి పార్టీలన్నింటినీ.. ఒక తాటిపైకి తేవడానికి… కేసీఆర్ లాంటి నేతలు అవసరం.
కేసీఆర్‌కు మూడు ఆప్షన్స్ ఉన్నాయి..!
ఇలాంటి పాత్ర పోషించడానికి.. అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిగితే.. తర్వాత జరిగే… పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవచ్చు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి.. తెలంగాణలో ఓడిపోతే.. కాంగ్రెస్ ను ఓడించినట్లుగా… టీఆర్ఎస్ పలుకుబడి జాతీయ రాజకీయాల్లో పెరుగుతుంది. అప్పుడు కేసీఆర్‌కు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టుకుని ఓ ఫ్రంట్‌గా రావడం, లేకపోతే.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ.. కూడగట్టుకుని బీజేపీ మద్దతితో అధికారం పొందడం లేదా… ఎన్డీఏలో టీఆర్ఎస్ను చేర్చేయడం. ఆ తర్వాత కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి.. తాను కేంద్రానికి వెళ్లిపోవడం. అలాంటి సమయంలో చెప్పుకోవడానికి కూడా ఓ కారణం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తూ.. కేటీఆర్‌కు పట్టం కడుతున్నానని చెప్పుకోవచ్చు. యూపీలో.. సమాజ్ వాదీ పార్టీ ఇలాంటి మోడల్ ను అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితే తెలంగాణలో ఏర్పడే అవకాశం ఉంది.
కేటీఆర్ గల్లీలో.. కేసీఆర్ ఢిల్లీలో అధికారం..!
కర్ణాటకలో దేవేగడ కూడా ఇలాంటి ఫార్ములానే అమలు చేస్తున్నారు. దేవేగౌడ ప్రధానమంత్రి కావడంతో.. దేవగౌడ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆయన … తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతీసారి కుమారస్వామినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతున్నారు. ఆ కోణంలోనే.. కేటీఆర్ కు ఇప్పుడు… ఓ ఇమేజ్ తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ప్రాధాన్యతను అనూహ్యగా పెంచుతున్నారు. రేపు టిక్కెట్ల కేటాయింపులోనూ.. కేటీఆర్ దే పైచేయి కావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలు కేటీఆర్ కోసమేననే వాదన… తెలంగాణ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా.. టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.