ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక వెళ్లొచ్చారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలుసుకున్నారు. అయితే, ఇదే ప్రయత్నమై ఆయన ఢిల్లీ వెళ్తారన్న కథనాలు చాలానే వచ్చాయి. పార్లమెంటు జరుగుతున్నప్పుడే కేసీఆర్ ఢిల్లీ వెళ్తారన్నారు. కానీ, ఇంతవరకూ ఆయన ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు. దీంతో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాట్లు నత్త నడకన సాగుతున్నాయన్నట్టుగా కనిపించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేసీఆర్ ను కలిసిన తరువాత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కేసీఆర్ ఆశిస్తున్న భాజపాయేతర, కాంగ్రెసేతర ఫ్రెంట్ సాధ్యమా అనే ప్రశ్న ఎలాగూ ఉంది. కర్ణాటక వెళ్లి దేవెగౌడను కలిసి వచ్చినా అదే ప్రశ్న ఉంది.
సరే, ఈ ప్రశ్నలూ అనుమానాలూ పక్కనబెడితే… ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా ఇకపై వరుసగా సమావేశాలు ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమచారం. ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభం కాబోతోంది. ఈ ప్లీనరీని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ప్లీనరీ తరువాత ఫ్రెంట్ ఏర్పాటు పనిలో కేసీఆర్ బిజీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ ముగిసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో సురవరం సుధాకర్ రెడ్డి, సీతారం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరికొన్ని పార్టీలకు చెందిన నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.
అయితే, కేసీఆర్ ప్రతిపాదించిన ఫ్రెంట్ విషయంలో మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నా… ఆమె కాంగ్రెస్ ని కలుపుకుని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దేవెగౌడ పరిస్థితి కూడా దాదాపు అదే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు జేడీఎస్ సాధిస్తే… తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ మద్దతు ఆయన తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భాజపాకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి సిద్ధపడుతున్నవారిలో చాలామందికి కాంగ్రెస్ తో సమస్య లేదు. కానీ, కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీయే సమస్య కదా! ఈ అంశమై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ పట్టువిడుపు ధోరణి ప్రదర్శించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొస్తే తప్ప… ఫ్రెంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఒక స్పస్టత వచ్చేలా కనిపించడం లేదు.