కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక గురి పెట్టారు. అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలోని కొన్ని చిన్న పార్టీలు బీఆర్ఎస్ లో విలీనం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక గురి పెట్టారు. మహారాష్ట్ర సరిహద్దు ఉన్న నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక బాధ్యతలిచ్చారు. ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు.
ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మండలాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. స్వతంత్ర భారత పక్ష పార్టీ ని విలీనం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నాదేండ్ ప్రాంతంలో ఈ పార్టీకి కొంత పట్టు ఉంది. సరిహద్దుల్లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, యువజన సంఘాలతో కూడా మంత్రి అల్లోల ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడమే కాకుండా సభ్యత్వ నమోదును లక్ష్యంగా చేసుకుంటున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఆసరాపెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమాలతో పాటు ఇతర పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏజెండా రూ పొందుతుందని భరోసా కల్పించనున్నారు. జనవరి మొదటి వారంలో కేసీఆర్ నాందేడ్‌లో పర్యటించి… బీఆర్ఎస్ విస్తరణపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. అయితే ఏపీలో మాత్రం ఇంత వరకూ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా పర్యటించడం లేదు.