హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ దర్యాప్తు నిజమేనని ఆయనకు గతంలో పర్సనల్ సెక్రెటరీగా పని చేసిన కపిలవాయి దిలీప్ కుమార్ చెప్పారు. కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి కాంట్రాక్ట్లు కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో తననుకూడా రెండు నెలల క్రితం విచారించారని దిలీప్ తెలిపారు. సీబీఐ విచారణ వివరాలనుమాత్రం తాను వెల్లడించలేనని చెప్పారు. ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాల్సింది కేసీఆరేనని అన్నారు. ఈ వ్యవహారంలో తనతో సహా అప్పుడు కార్మిక శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులను కూడా సీబీఐ విచారించిందని చెప్పారు. కేసీఆర్ను విచారించాకే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఆదేశాలమేరకే సంబంధిత అధికారులకు లేఖలు రాశానని, వాటిల్లో తన సొంత నిర్ణయాలేమీ లేవని దిలీప్ కుమార్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. దిలీప్ కుమార్ కొంతకాలం క్రితమే కేసీఆర్ దగ్గరనుంచి బయటకొచ్చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గంనుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించి ఈ ఏడాది మార్చి వరకు ఆ పదవిలో పనిచేశారు.