తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకు రావడం లేదు. రెండు జిల్లాల్లో పర్యటించి బహిరంగసభల్లో ప్రసంగించారు. ఆయన కాంగ్రెస్ సంగతి చూద్దామన్నారు కానీ బీజేపీని పల్తెత్తు మాట అనలేదు. దీంతో బీజేపీ నేతలు ఫీలవుతున్నారు. కేసీఆర్ కుట్ర చేస్తున్నారని గొణుక్కుంటున్నారు. కానీ పైకి ఏమీ అనలేని పరిస్థితి.
తెలంగాణలో బీజేపీకి బాగా హైప్ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్. అదే పనిగా టార్గెట్ చేసి తెలంగాణలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనే భావన ఎక్కువ ఎక్కువగా పంపించారు. ఉపఎన్నికల్లో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నూ బీజేపీనే టార్గెట్ చేశారు. ఫలితంగా బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతున్న వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మూడో పక్షంగా మారిపోయింది. రెండు పార్టీలు హోరాహోరీ తలపడుతూంటే.. కాంగ్రెస్ ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
అందుకే బీజేపీ ఎదుగుదలలో కేసీఆర్ పాత్ర ఉందని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బీజేపీపై యుద్ధం ప్రకటించి హఠాత్తుగా ఎందుకు అస్త్ర సన్యాసం చేశారు. బీజేపీని విమర్శించడం లేదు. ఆ పార్టీని పల్తెత్తు మాట అనడం లేదు. ఓ వైపు బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందాలని ప్రచారం..మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ విమర్శలు చేస్తూండటంతో చేరికలు కూడా లేకుండా పోయింది. కారణం ఏదైనా కేసీఆర్కు పోయేదేమీ లేదు. కానీ బీజేపీకి మాత్రం ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోతోంది.