సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫాం హౌస్ కేసులో ఇవిగో సాక్ష్యాలు అంటూ విడుదల చేశారు. మీడియాకు ప్రదర్శించడమే కాదు.. దేశంలోని అందరి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సీజే దగ్గర నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకూ అందరికీ పంపానని.. దయచేసి తేలికగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఇలా చేయడం తప్పు అని… న్యాయకోవిదులు ఎవరూ చెప్పలేదేమో కానీ ఇప్పుడు వరుసగా ఆయన తరపున లాయర్లు కోర్టుకు సారీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అంశంపై ఫామ్ హౌస్ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న దుష్యంత దవే ఇప్పటికే హైకోర్టుకు ఈ అంశంపై ఓ సారి సారీ చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా చెప్పాల్సి వచ్చింది.
ఫామ్ కేసు విచారణ సందర్భంగా దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడియో, వీడియోలను న్యాయమూర్తులకు ఎలా పంపుతారని జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్‌తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. కేసుకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్పులను పంపినందుకు న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరడంతో కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది. తాజాగా కేసు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సీఎం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.