తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్డీయేలో భాగస్వామి అవుతుంది.. అనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. సొంతంగా మెజారిటీ ఉన్నా, వీలైనంతగా మిత్రపక్షాలను కలుపుకుపోవడానికే మోడీ ప్రాధాన్యతను ఇస్తున్న తరుణంలో, కేసీఆర్ పార్టీ కేంద్రంలో అధికార భాగస్వామి అవుతుందనే మాట రెండేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది! అదిగో.. ఇదిగో.. అంటున్నా, ఇదైతే ఇంత వరకూ జరగలేదు. తెరాస వెళ్లి ఎన్డీయే భాగస్వామి అవుతుందని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవితకు కేంద్రంలో మంత్రి పదవి దక్కడం ఖాయమనే వ్యవహారం కూడా ఇప్పటి వరకూ ఒక కొలిక్కి రాలేదు.
మరి ఇంతకీ అసలు కథ ఏమిటి? అని ఆరా తీస్తే.. ఈ విషయంలో కేసీఆర్ నుంచి విజ్ఞప్తి వస్తే బీజేపీ వాళ్లు సానుకూలంగానే ఉన్నారట. అయితే తానై తాను విజ్ఞప్తి చేస్తే.. వెయిట్ తగ్గిపోతుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే బీజేపీకి మరీ అవసరం లేదు, అయితే ఎన్డీయేలో చేరతామంటే కాదనరు. కానీ అడిగితే మాత్రం అది యాచించుకున్నట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నాడు.
ఇలా కాదు.. యాచించడం కన్నా, ప్రాధాన్యత దక్కించుకొంటూ.. కేంద్రంలో అధికార భాగస్వామి కావాలనేది కేసీఆర్ భావన అని తెలుస్తోంది. అందుకోసం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండటమే మంచిదని ఆయన భావిస్తున్నాడట. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉండవు, అప్పుడు ఎలాగూ మిత్రపక్షాల అవసరం ఉండనే ఉంటుంది. అలాంటి సమయంలో.. వ్యూహాత్మకంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాళ్లతో భాగస్వామ్యులైతే.. జాతీయ స్థాయిలో ప్రాంతీయ శక్తిగా అవతరించవచ్చు, మంత్రి పదవులను కూడా గట్టిగా డిమాండ్ చేయవచ్చనేది కేసీఆర్ లెక్కగా తెలుస్తోంది. మరో మూడేళ్ల వరకూ నేషనల్ పాలిటిక్స్ లో సైలెంట్ గా ఉండటమే మేలని ఆయన భావిస్తున్నాడట. మరి కేసీఆర్ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ, మంత్రి పదవి విషయంలో చాలా ఆరాటంలో ఉన్న ఆయన తనయ ఈ వ్యూహం మేరకు మరో మూడేళ్ల పాటు వేచి ఉండగలదా?