మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు కూడా మొండి చెయ్యే చూపించింది! దీనిపై అధికార పార్టీ తెరాస ఏ స్థాయిలో భగ్గుమనాలి..? రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న భాజపా సర్కారుపై ఏ స్థాయిలో విమర్శలు చెయ్యాలి..? వలసలు, సభ్యత్వ నమోదు లక్ష్యాలతో రాష్ట్రంలో హడావుడి చేస్తున్న పార్టీని నైతికంగా ప్రభావితం ఈ సమయంలో ఎలా స్పందించాలి.. కేంద్రంతో దోస్తీ లేదని.. కాళేశ్వరం ప్రారంభానికి ప్రధానిని కేసీఆర్ పిలవనప్పుడే స్పష్టంగా అర్థమైపోయింది. తెరాసపై భాజపాకి కూడా ప్రత్యేకమైన ప్రేమలూదోమలూ లేవని… కేసీఆర్ సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావు ఆఫీసుల్లో ఐటీ దాడులతోనే అర్థమైపోయింది! కాబట్టి, బడ్జెట్ లో సొంత రాష్ట్రానికి నిధులూ కేటాయింపులూ లేకపోయితే కేసీఆర్ సాబ్ కస్సుమనాలి కదా! కానీ, తెరాస నేతలు సన్నాయి నొక్కులతోనే సరిపెడుతూ ఉండటం ఆశ్చర్యంగా ఉంది!
టిట్టర్లో కేటీఆర్ స్పందిస్తూ… మన సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నారన్నారు! రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధును ఆదర్శంగా తీసుకుని దేశంలో కిసాన్ సమ్మాన్ యోజనను గతంలో మోడీ ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు, మిషన్ భగీరథను స్ఫూర్తిగా తీసుకుని హర్ ఘర్ జల్ యోజనను కేంద్ర బడ్జెట్ లో పెట్టారని గొప్పగా చెప్పారు! మాజీ ఎంపీ కవిత స్పందిస్తూ… ఎకనమిక్ సర్వేలో తెలంగాణలో అమలౌతున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ మరోసారి సాధించిన ఘనత ఇది అన్నారామె! మాజీ ఎంపీ వినోద్ కాస్త నయం… కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం ఈ బడ్జెట్లో ఆ ప్రస్థావనే తేలేదని విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు లోక్ సభలో తెరాస పక్ష నేత నామా నాగేశ్వరరావు. దేశానికి దిక్సూచిగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకైనా అదనపు నిధులు వచ్చుంటే బాగుండేదన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అమలు చేయడం సంతోషకరమన్నారు మరో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఇంతే, ఇలానే తెరాస నేతలంతా కేంద్ర బడ్జెట్ పై సన్నాయి నొక్కులే నొక్కుతున్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని భాజపా నిర్లక్ష్యాన్ని బలంగా ప్రశ్నించే కంటే… కేసీఆర్ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుందనే సంబరానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పోనీ, ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్ఫూర్తి పొందిన పథకాలనీ, కేసీఆర్ ఆలోచనల ఆధారంగా ప్రవేశపెట్టినవి కేంద్రం నేరుగా ప్రకటించి ఉన్నా కొంత బాగుండేది! అయినా, ఆంధ్రా సర్కారు భాజపా మీద విమర్శలు చేయాలంటే ఆచితూచి స్పందిస్తుందంటే ఓ అర్థం కనిపిస్తుంది! ఇప్పుడు తెరాసకు ఎందుకీ ధోరణి..? దేశానికి కేసీఆర్ ఆదర్శమయ్యారని ప్రచారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒరిగేది ఏమీ లేదు కదా! రాష్ట్రానికి నిధులు కావాలి. కేసీఆర్ దేశానికి ఆదర్శమయ్యారని చెప్పుకుంటే కడుపు నిండుతుందా..?