నడిపించే నాయకుడు సైలెంట్ గా ఉండిపోతే ఏం జరుగుతుందన్నది బీఆర్ఎస్ లో జరుగుతోన్న పరిణామాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. నేతలకు దిశానిర్దేశం చేసే అధినేత ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ క్రమంగా పట్టు తప్పుతుంది అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ప్రకటనలు, ఆందోళనలు కేసీఆర్ కు తెలిసే జరుగుతున్నాయా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కేసీఆర్ కు తెలిసే జరిగిందా? లేక అప్పటికప్పుడు కౌశిక్ రెడ్డి తీసుకున్న సొంత నిర్ణయమా ?అనే చర్చ మొదలైంది. ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలన్నా కేసీఆర్ , కేటీఆర్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అని చెప్పేవారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కేసీఆర్ కు తెలియకుండా జరిగిందా? అంటే స్పష్టత లేకపోయినా..కేసీఆర్ కు తెలిసే జరిగితే ఈ వివాదంలో బీఆర్ఎస్ బాస్ వ్యూహం బెడిసికొట్టినట్లే. ఎందుకంటే ఈ వివాదంలో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో కేసీఆర్ కు తెలియకుండా ఇదంతా జరిగితే పార్టీపై కేసీఆర్ పట్టు కోల్పోతుందని అనేందుకు ఇదో సంకేతం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు..పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై కేసీఆర్ పెద్దగా దృష్టిపెట్టకపోవడంతో నేతలు కూడా ఇష్టారీతిన ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడేస్తున్నారు. అది పార్టీ నిర్ణయమా? సొంత అభిప్రాయమా క్లారిటీ లేకుండా పోవడంతో శ్రేణులు గందరగోళానికి గురి అవుతోంది. ఈ గందరగోళానికి తెరతీసే ప్రకటనల వలన నేతలు – కార్యకర్తల మధ్య సమన్వయం దెబ్బతిని పార్టీ విచ్చిన్నానికి దారితీసే ప్రమాదం ఉందని..అందుకే కేసీఆర్ ఇకనైనా మౌనం వీడి బయటకు వచ్చి.. నేతలకు దిశానిర్దేశం చేయాలని.. వ్యూహం పేరిట మౌనం వహిస్తే బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.