జగన్ పాదయాత్ర కొద్దిరోజుల్లో మొదలు కానుండగా అధికార పక్షం నుంచి విసుర్లు, సవాళ్ళు, ఎద్దేవాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో కొత్తగా చేరారు మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి .
ఆయన మాట్లాడుతూ, “జగన్ పాదయాత్ర కాదు కదా, తలక్రిందులుగా యాత్ర చేసినా ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే ఆయన కి అధికారం అంటే ఎంత యావ అనేది స్వయంగా ఆయనే చెప్పాడు. ముఖ్యమంత్రి కావాలనీ, 30 యేళ్ళ పాటు అదే పదవిలో ఉండాలని ఆయన కోరిక అని ఆయనే ప్రకటించుకున్నాడు. అధికారం అంటే అంత యావ ఉన్నవాడు కాబట్టి, ప్రజలు ఆయన్ని ఎన్నుకోరు. రాజు కొడుకు రాజు కావచ్చు కానీ, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని లేదు” అని విసుర్లు విసిరారు కృష్ణమూర్తి.
అంతా బాగానే ఉంది కానీ, “ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని లేదు” అనే మాట మాత్రం జగన్ కే కాదు, లోకేష్ కి కూడా వర్తిస్తుందని గుర్తు చేస్తున్నారు వైసిపి నాయకులు. ఇదిలా ఉంటే, శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న జగన్ అభ్యర్థన కి కోర్ట్ నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదు. వచ్చే శుక్రవారం అంటే 20 వ తేదీకి కోర్ట్ ఈ పిటిషన్ ని వాయిదా వేసింది.