ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణ మూర్తి శనివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలంలో హోసూరులో తెదేపా జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన తన రెండవ కొడుకు కె.ఈ. శ్యాంబాబు తన రాజకీయ వారసుడని ప్రకటింఛారు. అంతే కాదు అతను 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో హోసూరు నుండి పోటీ చేస్తాడని కూడా ప్రకటించడం విశేషం. ఈ నియోజకవర్గ ప్రజలు తెదేపాను చాలా కాలంగా ఆదరిస్తున్నారని, తన కొడుకును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి, కర్నూలు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. కర్నూలు మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కనుక పట్టణంలో ప్రజలు తమ తమ వార్డులలో రోడ్లు, మంచి నీళ్ళు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు వగైరా పనుల కోసం మునిసిపాల్ కార్పోరేషన్ కు దరఖాస్తులు అందజేయవలసిందిగా కోరారు.
సాధారణంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించే తెదేపా సభ్యుడు టి.జి. వెంకటేష్ కూడా పార్టీ చేపట్టిన ఈ జనచైతన్య యాత్రలలో పాల్గొనడం ఒక విశేషం అయితే, త్వరలో చేపట్టబోయే జన్మభూమి కార్యక్రమంలో స్థానిక ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇవ్వడం, కర్నూలు మునిసిపల్ ఎన్నికలలో తెదేపాకే ఓట్లు వేయమని ప్రజలను కోరడం మరో విశేషం.