కర్నూలు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పార్టీని వీడటంతో… ఆయన టీడీపీలో చేరడం లాంఛనమే అనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి మొదటివారంలో చేరేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారనీ అంటున్నారు. అయితే, పార్టీలో చేరిక సందర్భంగా మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ టిక్కెట్ కోసం కోట్ల పట్టుబడుతున్నారనే కథనాలూ ఉన్నాయి. ఇక, కోట్ల చేరికపై కర్నూలుకి చెందిన కొంతమంది కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సి ఉంటుందని తెలిసిందే. కోట్ల చేరిక క్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందన ఎలా ఉంటుందనేది కొంత ఆసక్తికరంగా మారింది. కోట్ల కోరినట్టుగా అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలంటే, ఆ జిల్లాకు చెందిన కేఈని కొంత బుజ్జగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేఈ కృష్ణమూర్తి భేటీ అయ్యారు.
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎంతో భేటీ అనంతరం కేఈ మీడియాతో మాట్లాడారు. కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి వస్తోందన్న విషయాన్ని ముఖ్యమంత్రి తన దగ్గర ప్రస్థావించలేదన్నారు. కేవలం శ్రీశైలం ట్రస్టు బోర్డుకు సంబంధించిన చర్చ మాత్రమే తమ మధ్య జరిగిందన్నారు. కోట్ల చేరిక అంశమై తనంతట తాను ముఖ్యమంత్రి దగ్గర చర్చకు పెట్టననీ, చంద్రబాబే ఆ అంశం తనతో చర్చించేందుకు పిలిస్తే… అప్పుడు తన అభిప్రాయం తప్పకుండా చెబుతాను అన్నారు కేఈ. ఆలేరు, డోన్, కోడుమూరు అసెంబ్లీ స్థానాలను కోట్ల కుటుంబం టీడీపీ నుంచి అడుగుతున్నట్టుగా కూడా తనకు తెలియదన్నారు. అయితే, కోట్ల చేరిక అంశంపై ఇప్పటికే కొంతమంది కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు చర్చించారని సమాచారం.
నిజానికి, కోట్ల కుటుంబాన్ని చేర్చుకునే ముందు కేఈని ఒప్పించడమే కీలకమనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా డోన్ సీటు విషయంలో కచ్చితంగా కేఈని ఒప్పించాల్సిన పరిస్థితి ఉంటుందనీ, జిల్లాలో ఇతర సీట్ల కేటాయింపుపై కూడా ఆ కుటుంబంతో చర్చలు అవసరమౌతాయనీ, ఈ వ్యవహారం ముఖ్యమంత్రి జోక్యంతో క్లియర్ అయిపోతుందని పార్టీ వర్గాలు అన్నాయి. అయితే, ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో అలాంటి అంశమే చర్చకు రాలేదని కేఈ చెప్పడం విశేషం. అంతేకాదు, కోట్ల చేరికకు సంబంధించి ఏ సమాచారమూ తనకు తెలియదు అన్నట్టుగా ఆయన స్పందించడం కొంత ఆశ్చర్యకరమే.