ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ ని తెదేపా నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దం అవుతోంది. మాజీ మంత్రి టిజి వెంకటేష్ కి రాజ్యసభ సీటు కేటాయించనందుకు నిరసనగా ఆయన నిన్న తన అనుచరులతో కలిసి కర్నూలులో పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన టిజి వెంకటేష్ కి రాజ్యసభ సీటు కేటాయించడం అన్యాయం అని, ఇలాగైతే జిల్లాలో పార్టీని భూస్థాపితం చేస్తానని, తెదేపాను కూకటి వేళ్ళతో సహా పెకలించివేస్తానని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన అనుచరులు కూడా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి సోదరుడే ఈవిధంగా వ్యవహరించడంతో తెదేపా నేతలు ఎవరూ గట్టిగా మాట్లాడలేకపోయారు. తప్పనిసరి పరిస్థితులలో కేఈ కృష్ణ మూర్తి స్వయంగా స్పందించవలసి వచ్చింది. “తెదేపా క్రమశిక్షణకి మారుపేరు. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీకి ఎవరు చెడ్డపేరు తెచ్చినా చర్యలు తప్పవు. పదవి దక్కలేదని రోడ్ల మీదకి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించబోము. తమ్ముడైనా..కుమారుడైన సరే!” అని మీడియాతో అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రభాకర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిని కలిసి క్షమాపణలు చెపితే ఇంతటితో మందలింపుతో సరిపెట్టవచ్చు లేదా ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి భాజపాకి, ఒకటి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన టిజి వెంకటేష్ కి, మరొకటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కట్టబెట్టినందుకు పార్టీలో నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి తలొగ్గి అందరూ మౌనం వహించారు. ప్రాభాకర్ ఒక్కరూ బయటపడి సస్పెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకొన్నారు.