కీరవాణి చేతిలో `ఆర్.ఆర్.ఆర్`తో పాటు మరి కొన్ని సినిమాలున్నాయిప్పుడు. అందులో `చెక్` ఒకటి. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. అయితే ఈ సినిమా నుంచి కీరవాణి తప్పుకున్నారు. అందుకు కారణం.. బడ్జెట్టే అని తెలుస్తోంది. లాక్ డౌన్, కరోనా గొడవల కంటే ముందే మొదలైన సినిమా ఇది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. బడ్జెట్లు తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది.
కీరవాణి ఖరీదైన మ్యూజిక్ డైరెక్టర్. ఇది వరకు ఇచ్చిన బడ్జెట్ కంటే, ఇప్పుడు కాస్త తక్కువ కోడ్ చేసినట్టు సమాచారం. దాంతో… కీరవాణి ఈసినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. కీరవాణి స్థానంలో శ్రీకర్ అగస్తిని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. `కంచరపాలెం` సినిమాతో ఆకట్టుకున్నాడు శ్రీకర్. ఆ పాటలు నచ్చే చంద్రశేఖర్ ఏలేటి ఈ ప్రాజెక్టు అప్పగించాడని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకర్.. ట్యూన్లు సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడట. ఈసినిమాలో పాటలు తక్కువే అని, కాకపోతే రీ రికార్డింగ్ కి మంచి స్కోప్ ఉందని తెలుస్తోంది.