ఈ సంక్రాంతి పండగకి బాక్సాఫీసు దగ్గర రసవత్తరమైన పోటీ నెలకొంది. ఒకటి కాదు… 4 సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వీరిలో ఎవరు ఆధిపత్యం సంపాదిస్తారు? ఏ సినిమాకి రికార్డు వసూళ్లు దక్కుతాయి? అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పోటీ ఉన్నది సినిమాల మధ్యే. సినిమా వాళ్ల మధ్య కాదు. సినిమా వాళ్లు మాత్రం ఈ పండక్కి వచ్చిన ప్రతీ సినిమా హిట్ అవ్వాలని, అందులో తమ సినిమా కూడా ఉండాలని కోరుకొంటున్నారు. కీరవాణి మాత్రం.. వెరైటీగా ఈ పండగ సినిమాలన్నింటికీ తనదైన స్టైల్ లో.. ఓ పాట రూపంలో విషెష్ చెప్పారు.
ఈ పండగ సినిమాల్లో ‘నా సామిరంగ’ ఒకటి. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీత కర్త. ఈనెల 14న ఈ సినిమా వస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో ఓ ప్రత్యేక గీతాన్ని వినిపించారు. ఈ పాటలో పండగ సినిమాలకు మూకుమ్మడిగా శుభాకాంక్షలు అందజేసిన విధానం ఆకట్టుకొంది. ఆ పాట ఎలా సాగిందంటే..?
”సిల్లో బొల్లో అంటూ సంకురాత్రి వచ్చింది
సినిమాకెళ్దారంటూ మనసు ఉరకలేసింది
పరుసులోని పచ్చనోటు కరుసైపోతానంది
అభిమాన థియేటరు అలికి ముగ్గులేసింది
ఆల్ ది బెస్టు సినీ గోయరూ..
బాక్సాఫీసుకి పెంచేయ్రా ఫీవరూ..
మెగాస్టారు ఆశీస్సులు మెండిగానే పొందావు
ఎగాదిగా భాషలెన్నో నువ్వు నేర్చుకొన్నావు
చిన్న సినిమా అంటూ ఎవరు ఎన్ని అంటున్నా..
పెద్ద అడుగులు వేసి హిట్టు దారి పట్టావు
ఆల్ ద బెస్టు నీకు హను మానూ
ముందెళ్లి నువ్వు సెట్టు చేయి టోనూ..
నేలా బెంచీలున్న రోజులెళ్లిపోయాయి
బాల్కనీల షోకులన్నీ పాతబడిపోయాయి
మిగిలింది ఒకటే క్లాసు.. కుర్చీ అని అన్నాయి
కుర్చీ మడతాపెట్టి.. గంతులేయమన్నాయి
ఆల్ ద బెస్టు గుంటూరు కారం
నువ్వదరగొట్టు ఈ శుక్రవారం…
సినిమా చూసే పండగ తెలుగువాడికొచ్చింది
డబ్బులు కాసే పండగ థియేటర్లకొచ్చింది
డైమండ్ జూబ్లీ పండగ విక్టరీకి వచ్చింది
ఆల్ ద బెస్టు నీకు కూడా సైంధవా
హిట్టు కొట్టి వేసుకోరా కండువా
లేటుగ వచ్చినగానీ లేటెస్టుగా వస్తాము
ఘాటు ఘాటు వినోదాలు స్వీటుగానే ఇస్తాము
తోటివాళ్ల ఆనందం మేము పంచుకొంటాము
కోటి కోటి సంబరాలు మూటగట్టుకొంటాము
రంగరంగ రంగ వైభవంగా.. ఈ పండక్కి నా సామి రంగా!”