ఇటీవల ఒక పత్రిక కి ఇచ్చిన సుధీర్గమైన ఇంటర్వ్యూలో మహానటి సినిమా గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే (https://www.telugu360.com/te/jamuna-about-mahanati-movie-and-her-relation-with-savithri/). “ఈ మధ్య ఎవరో దర్శకుడు సావిత్రి జీవిత కథతో సినిమా చేస్తున్నారని విన్నాను. ఆమె గురించి అతనికి ఏం తెలుసని సినిమా రూపొందిస్తున్నాడో తెలియదు. ఆమెతో అనుబంధం ఉండి బతికున్న ఒకే ఒకదాన్ని నేను. నాలాంటి వాళ్లను కనీసం సంప్రదించకుండా సినిమా చేస్తున్నారు. అయినా సావిత్రికి తెరరూపమివ్వ గల నాయికలు ఉన్నారా ఇప్పుడు. అసలు భాషే తెలియకుండా నటిస్తున్నారు” అని జమున వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి కీర్తి సురేష్ సమాధానమివ్వడం సంచలనాన్ని కలిగిస్తోంది.
ఆ వ్యాఖ్యలకి కీర్తి సురేష్ సమాధానమిస్తూ- సావిత్రి పాత్రలో నటించడానికి తాను అర్హురాలినేనని సమర్థించుకుంది. తాను ఆమె గురించి క్షణంగా తెలుసుకున్న తరువాతనే, అందుకు చాలా శిక్షణ పొందాకే ఆమెలా నటించడానికి అంగీకరించానని చెప్పింది. సావిత్రికి సంబంధించిన పుస్తకాలను చదివానని, సావిత్రి నటించిన పలు చిత్రాలు చూశానని, ఆ తరువాత సావిత్రి కూతురు ఛాముండేశ్వరిని కలిసి సావిత్రి మేనరిజం గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పింది. ఆ తరువాత ఆమెలా నటించడంలో శిక్షణ పొందానని, ఇవన్నీ దర్శక నిర్మాతలకు సంతృప్తిని కలిగించిన తరువాతనే ఆ పాత్రలో నటించడం ప్రారంభించానని తెలిపింది. క్రికెట్ క్రీడ అన్నా, స్మిమ్మింగ్, డ్రైవింగ్ అన్నా సావిత్రి లాగానే తనకూ చాలా ఆసక్తి అని, ఆ రకంగా తమ వ్యక్తిత్వాల్లోనూ పోలిక ఉందని చెబుతూ చిత్రం విడుదలైన తరువాత తన నటన గురించి విమర్శించడం సబబుగా ఉంటుందని సుతిమెత్తని చురకలంటించింది.