‘లక్కీ భాస్కర్’తో ఓ హిట్టు తన ఖాతాలో వేసుకొన్నాడు వెంకీ అట్లూరి. ఇప్పుడు తమిళ స్టార్ సూర్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి `796 CC` అనే పేరు పరిశీలిస్తున్నారు. మారుతీ కార్లు భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది.’796 CC’ అనేది కూడా మారుతీ ఇంజను కెపాసిటీని సూచించేదే. బయోపిక్స్ అంటే.. సూర్యకు చాలా ఇష్టం. ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా బయోపిక్కే. అది మంచి విజయాన్ని అందుకొంది. సూర్యకు అవార్డులూ రివార్డులూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి అదే బాటలో నడవబోతున్నాడు.
ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇంకా ఫిక్సవ్వలేదు. బయట చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త పేరు వచ్చి చేరింది. తనే.. కీర్తి సురేష్. ఈ సినిమాలో కీర్తి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నార్ట. వెంకీ అట్లూరి సినిమా ‘రంగ్ దే’లో కీర్తినే కథానాయిక. సూర్య, కీర్తిల జోడీ బాగుంటుందని, ఫ్రెష్ ఫీల్ వస్తుందన్నది వెంకీ ఆలోచన. మే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నదని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.