బాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తారు కథానాయికలు. అదో మైల్ స్టోన్ అన్నది వాళ్ల ఫీలింగు. `దక్షిణాదిన హీరోయిన్ పాత్రలకు తగిన గుర్తింపు లేద`ని వాపోయే ముద్దుగుమ్మలే.. బాలీవుడ్ లో అరకొర పాత్రలిచ్చినా మురిసిపోతారు. బాలీవుడ్ అంటే… ఎవరెస్టు ఎక్కడంతో సమానం అంటూ లెక్కలేస్తారు. అలాంటిది ఓ బాలీవుడ్ ఆఫర్‌ని తిరస్కరించింది కీర్తి సురేష్. దానికి కారణం బికినీ.
ఈమధ్య కీర్తికి బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒకట్రెండు సినిమాల్ని ఫైనల్ చేసి పెట్టుకుంది. అయితే ఓ సినిమా మాత్రం కాదనుకుంది. దానికి కారణం.. అందులో బికినీతో కనిపించాలట. అందుకే ఆ సినిమాని వదులుకుంది. మనకంటే బికినీ కొత్త గానీ, బాలీవుడ్ లో సర్వసాధారణమైన విషయం. కథానాయికల్ని అవసరం ఉన్నా, లేకున్నా ‘అలా’ చూపించడం అక్కడ అలవాటు. అయితే కీర్తి మాత్రం ”అందంగా కనిపించడం వేరు. స్కిన్ షో వేరు. నేను స్కిన్ షోకి వ్యతిరేకం. అదృష్టవశాత్తూ దక్షిణాదిన స్కిన్ షో చేయమని ఏ దర్శకుడూ నన్ను అడగలేదు. కానీ బాలీవుడ్ పరిస్థితులు వేరు. అక్కడ అది మామూలు విషయం. కానీ అలా కనిపించడానికి నా మనసు ఒప్పుకోదు” అని కుండ బద్దలు కొట్టేసింది. అయినా కొంతమంది స్కిన్ షో చేసినా బాగుంటారు. ఇంకొంతమందిని మాత్రం అలా చూడ్డానికి మనసొప్పదు. కీర్తి అలాంటి కథానాయికే. ‘మహానటి’ తరవాత ఆమెపై క్లాస్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. ఆ ఇమేజ్‌కి భంగం కలిగితే కీర్తి ఏమో గానీ, దక్షిణాది ప్రేక్షకులు ఏమాత్రం ఒప్పుకోలేరు.